ప్రపంచ స్ట్రోక్ సంస్థ డైరెక్టర్ గా డాక్టర్ పి. విజయ

గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు, లలితా పి.వి.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసైన్సెస్ విభాగాధిపతి, అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ డైరెక్టర్, న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్, గుంటూరు అధ్యక్షురాలు డా. పి. విజయ (MD.,DM.,FWSO.,FIAN.,FIAMS) ప్రపంచ స్ట్రోక్ సంస్థ (World Stroke Organization – WSO) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు చెందిన 3,500 మంది WSO సభ్యుల ద్వారా ఎన్నికైన 18 మంది ప్రతిష్టాత్మక డైరెక్టర్లలో డా. విజయ ఒకరిగా ఎన్నిక కావడం విశేషం. అమెరికా, యూరప్, ఆఫ్రికా/మిడిల్ ఈస్ట్ లతో పాటు ఉన్న 4 ప్రధాన ఖండాల గ్రూపులలో ఒకటైన ఆసియా-ఓషియానియా ప్రాంతానికి డాక్టర్ విజయ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) అత్యుత్తమ చికిత్సలు, పరిశోధన, ప్రజలలో అవగాహన మరియు ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో ఆమె అందించిన విశిష్ట సేవలకు గాను ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ స్ట్రోక్ సంస్థ (WSO) అనేది ప్రపంచవ్యాప్తంగా పక్షవాత నివారణ, అత్యాధునిక చికిత్స, పునరావాసం, పరిశోధన, వైద్య విద్య మరియు ప్రజల్లో అవగాహన పెంపుదల కోసం పనిచేస్తున్న అత్యున్నత అంతర్జాతీయ సంస్థ.
డాక్టర్ విజయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా 2026 నుంచి 2030 వరకు నాలుగేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ పదవిలో ఆమె ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వైద్య విధానాల రూపకల్పన, అంతర్జాతీయ చికిత్స మార్గదర్శకాల (Guidelines) అభివృద్ధి, విద్యా కార్యక్రమాల నిర్వహణ, ప్రపంచ స్ట్రోక్ కార్యక్రమాల పర్యవేక్షణ, వివిధ దేశాల స్ట్రోక్ నిపుణులు మరియు జాతీయ స్ట్రోక్ సంఘాల మధ్య సమన్వయం, అలాగే స్ట్రోక్ అవగాహన మరియు సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. నూతన బోర్డు తొలి సమావేశంలో పాల్గొనడానికి ఈ ఏడాది అక్టోబర్లో ఆమె దక్షిణ కొరియాలోని సియోల్కు వెళ్లనున్నారు.
భారతదేశంలో ఆధునిక స్ట్రోక్ వైద్య సేవలకు శ్రీకారం చుట్టిన ప్రముఖుల్లో డా. విజయ ఒకరు. ఆమె 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్ట్రోక్ యూనిట్ను ప్రారంభించారు. ముంబై, చెన్నై తర్వాత దేశంలో స్థాపించబడిన మూడవ స్ట్రోక్ యూనిట్. ఆమె నాయకత్వంలో ఈ కేంద్రం ఎంతో అభివృద్ధి చెంది, భారతదేశంలోనే మొట్టమొదటి అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ (1st Accredited Advanced Stroke Center) గా గౌరవాన్ని అందుకున్నారు. డాక్టర్ విజయతో పాటు ఆమె నాయకత్వంలోని అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రదానం చేసే పాల్ డడ్లీ వైట్ ఇంటర్నేషనల్ స్కాలర్ అవార్డు, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (AAN) యొక్క ఏ.బి. బేకర్ అవార్డు, అలాగే ప్రపంచ స్ట్రోక్ సంస్థ–ఏంజెల్స్ కార్యక్రమం నుంచి వరుసగా డైమండ్ స్టేటస్ అవార్డులు అందుకోవడం విశేషం.
ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా డాక్టర్ విజయఎన్నిక కావడం భారతదేశంలో స్ట్రోక్ వైద్యరంగ అభివృద్ధికి ఆమె అందించిన అసాధారణ సేవలకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ఈ అరుదైన గౌరవం లలితా పి.వి.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ వైద్య సమాజం మరియు యావత్ దేశానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
