గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

రెండేళ్లలో ఇరిగేషన్ రంగానికి రూ.24 వేలకోట్లు ఖర్చు
ప్రకటించిన క్యాలెండర్ కు అనుగుణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు
డబ్బులిచ్చి మరీ గొడ్డలి పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది
పవన్ ను అవమానిస్తున్నారు… వాళ్ల కుటుంబ సభ్యులను కించపరుస్తున్నారు
పిచ్చుకలంకలో రైతుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ధవళేశ్వరం బ్యారేజీకి రూ.153 కోట్లతో 117 కొత్త గేట్ల eఏర్పాటు పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి
కొత్తపేట/ఆత్రేయపురం, జులై 13:- గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందని అధికారులు వివరించారు. అలాగే కాల్వలకు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని ముఖ్యమంత్రి అడిగారు. 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని అధికారులు చెప్పారు. కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు దేశానికే అన్నపూర్ణ అనే ఖ్యాతి రావడానికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టే కారణమని, అనంతరం ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన కొత్త బ్యారేజీతో మరో పంటకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. 2.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యంతో పాటు ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాల్లో కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా బ్యారేజీ ఉపయోగపడుతోందన్నారు. అయితే 50 ఏళ్లకు పైగా గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబడటంతో వాటి ఆధునీకరణ అత్యవసరమైందని ముఖ్యమంత్రి చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.32 కోట్లతో కొత్త గేట్లను అమర్చిందని, ఇప్పుడు మిగిలిన పాత గేట్ల స్థానంలో 117 కొత్త గేట్లను తొమ్మిది నెలల్లో అమర్చేలా చర్యలు ప్రారంభించామని సీఎం తెలిపారు. గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీస నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని… కనీసం గ్రీజ్ పెట్టేందుకు అవసరమైన నిధులను కూడా గత పాలకులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తంగా కొత్త గేట్లను బిగించామని వివరించారు. తాము గత రెండేళ్లలోనే సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు వెచ్చించామని ముఖ్యమంత్రి తెలిపారు.

పోలవరం నిర్వాసితులను ఆనందంగా ఉంచుతాం
ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే, ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని సీఎం విమర్శించారు. 2014-19 మధ్య 72 శాతం పనులు పూర్తిచేయగా, ఆ తర్వాత ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు మాత్రమే జరిగాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమై ప్రస్తుతం 89 శాతం పురోగతి సాధించామని తెలిపారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని, పునరావాసం, పరిహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. వారిని ఆనందంగా ఉంచుతామని… అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రకటించిన క్యాలెండర్ కు అనుగుణంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు చేపడుతోందని చెప్పారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు నీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా, రాయలసీమకు తరలించి అక్కడి వ్యవసాయ రూపురేఖలనే మార్చామని ముఖ్యమంత్రి వివరించారు. మైక్రో ఇరిగేషన్ విస్తరించడంతో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాయని, పరిశ్రమలకు నీటి సరఫరా సాధ్యమై కియా వంటి భారీ పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

కూటమిపై గోదావరి జిల్లాల ప్రజల అభిమానం తరగనిది
గోదావరి ప్రజలు అభివృద్ధిని ఆదరించే స్వభావం కలవారని, గతంలోనూ టీడీపీకి అపూర్వ ఆదరణ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన భారీ విజయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారం, భగవంతుడి ఆశీస్సులతో ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పుష్కర ఘాట్ల అభివృద్ధితో పాటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని, కోనసీమకు రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోవ్వూరులో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నామని, మెట్ట ప్రాంతాల్లో పామాయిల్, కోకో సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో శాస్త్రీయ విధానాలు అనుసరించాలని సీఎం సూచించారు.

అభివృద్ధి-సంక్షేమమే కూటమి లక్ష్యం
రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని, సామాజిక భద్రత పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ప్రజల మధ్యకే రావాలనే తపనతో ఉన్నారని, ముంబై వెళ్లి ఆయనను పరామర్శించి పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రజాసేవలో పాల్గొనాలని సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై రాజీపడబోమని సీఎం హెచ్చరించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా, మహిళలను కించపరిచే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రౌడీలతో, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లను మించి గొడ్డలి పార్టీతోనే సమస్యలు సృష్టిస్తోందని సీఎం మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని… ఆడవాళ్లని అసభ్యంగా మాట్లాడే వారిని గొడ్డలి పార్టీ సమర్థిస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ… గొడ్డలి పార్టీ నేతలు ఫైనాన్స్ చేస్తున్నారు.. స్టూడియోలు పెట్టిస్తున్నారని విమర్శించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను గొడ్డలి పార్టీ సపోర్ట్ చేస్తోందని… వారికి డబ్బులిచ్చి ప్రొత్సహిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. వీళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
