రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్

– నికర జలాల వినియోగానికి ఇదే ఏకైక మార్గం
– ఇది లేకపోతే కేటాయించిన నీళ్లూ వాడుకోలేం
– రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు
– రాయలసీమ హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం
: సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ
నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ పోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వై.యస్.ఆర్.సి.పి. రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ కమిటీ కన్వీనర్ సాకే శైలజనాథ్, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డా.కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి.
* రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కేటాయించిన 101 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే ఏకైక మార్గమే రాయలసీమ ఎత్తిపోతల పథకం.
* జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు 80 శాతానికి పైగా పూర్తి
* రూ.900 కోట్లకు పైగా బిల్లులు చెల్లించగా కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది.
* పంపులు, మోటార్లకు ఆర్డర్లు ఇచ్చినా ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కొనసాగించలేదు.
* తెలంగాణకు ఇచ్చిన రాజకీయ హామీ కారణంగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ను నిలిపివేశారు.
* ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలపై నిర్లక్ష్యానికి నిదర్శనం.
* పోలవరం ఎత్తు తగ్గింపు, బనకచర్ల వంటి కొత్త హామీలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.
* రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
* అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మేధావులు, పౌరసంఘాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి
* వైయస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు
నెల్లూరు, ఆంధ్రావని న్యూస్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని, రాయలసీమ భవిష్యత్తును మార్చే “గేమ్ చేంజర్” అని వైయస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు లేకుంటే రాయలసీమకు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కేటాయించిన కృష్ణా నదీ నికర జలాలను కూడా వినియోగించుకునే పరిస్థితి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 80 శాతానికి పైగా పూర్తయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, పోలవరం అంశం, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేత వంటి విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని, రైతులు, మేధావులు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రెస్‌మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
– రాయలసీమ లిఫ్ట్ ఈ ప్రాంతానికి జీవనాధారం
రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కృష్ణా జలాల్లో 101 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, ఎగువ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రం తక్కువ ఎత్తు నుంచే నీటిని తీసుకుంటున్న పరిస్థితుల వల్ల ఆ నీటిని వినియోగించుకునే అవకాశం క్రమంగా తగ్గిపోయింది. ఈ సంక్షోభానికి ఏకైక పరిష్కారం రాయలసీమ ఎత్తిపోతల పథకమే. తెలంగాణ తీసుకుంటున్న అదే స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా శ్రీ వైయస్ జగన్ గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. కాలువలు, సివిల్ పనులు పూర్తి చేసి రూ.900 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాం. పంపులు, మోటార్లకు కూడా ఆర్డర్లు ఇచ్చాం. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని బిగించి ప్రాజెక్టును పూర్తి చేయాల్సింది పోయి కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. దీంతో రాయలసీమకు కేటాయించిన నికర జలాలను కూడా వినియోగించుకోలేని ప్రమాదం ఏర్పడింది.
– రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసింది కూటమి ప్రభుత్వమే
ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు తెలిసింది. తనతో జరిగిన చర్చలో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేస్తానని చెప్పారని ఆయన వెల్లడించారు. దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఒకసారి పర్యావరణ అనుమతుల పేరుతో, మరోసారి ప్రాజెక్టును తామే ఆపలేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ అందుకు విరుద్ధంగా ఆధారాలను కూడా మేము ప్రజల ముందుంచాం. ప్రస్తుతం నీటి లభ్యతపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.
– రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల కేవలం రాయలసీమ మాత్రమే కాదు, కృష్ణా జలాలపై ఆధారపడిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభావితమవుతుంది. అయినా ఆల్మట్టి ఎత్తు పెంపుపై చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. గతంలోనూ ఇదే వైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కేంద్రంలో కీలక పాత్రలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క మాట మాట్లాడకుండా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఆల్మట్టి ఎత్తు పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, పోలవరం అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేలా చేయడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంది. పూర్తి కావాల్సిన రాయలసీమ లిఫ్ట్‌ను వదిలేసి బనకచర్ల పేరుతో కొత్త భ్రమలు సృష్టించడం ప్రజలను మోసం చేయడమే. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టే రాయలసీమ భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్. అది లేకపోతే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కేటాయించిన నికర జలాలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రైతులు, మేధావులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు
– రాయలసీమ సాగునీటి హక్కుల కోసం కార్యాచరణ:
– రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసి ఉద్యమాన్ని గ్రామస్థాయికి విస్తరించాలని నిర్ణయం.
* రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై సాంకేతిక నిపుణులు, మేధావులు, రాజకీయ నాయకులతో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించనున్నారు.
* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీ ప్రతినిధులతో పాటు మేధావులు, రైతులు, పదవీ విరమణ పొందిన అధికారులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియను జూలై 25లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు.
* జూలై 30న అన్ని జిల్లాల్లో కొత్త కమిటీలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి జిల్లా వారీ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
* రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు రూపొందించి ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
* కమిటీ సభ్యులకు సాగునీటి ప్రాజెక్టుల సాంకేతిక, చారిత్రక, న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక ఓరియంటేషన్, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
* రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సభ్యులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ అసెంబ్లీ కమిటీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
* పదవీ విరమణ పొందిన ఇంజనీర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, నీటి వనరుల నిపుణులతో ప్రత్యేక సలహా కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమానికి సాంకేతిక, విధానపరమైన సహకారం అందించనున్నారు.
* ఆగస్టు నెలలో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించి రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశం నిర్ణయించింది.
