Medical and Health

ప్రభుత్వాసుపత్రుల్లో ‘ఏఐ’ ఆధారిత వైద్య సేవలు

వైద్య సేవలు, పనితీరు ఆధారంగా ఎంపిక చేసే ఉత్తమ అoకుర సంస్థలకు నగదు ప్రోత్సాహాకాలు

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థకు రూ.కోటి ‘వర్క్ ఆర్డర్’

మరో 12 సంస్థలకు రూ. 5 లక్షల నుంచి రూ. లక్ష వరకు అందచేత..

ప్రత్యేక కమిటీ ద్వారా ఆవిష్కరణల పనితీరుపై అధ్యయనం, ఉత్తమ సంస్థల ఎంపిక

ఫలితాల వివరాల వెల్లడికి త్వరలో ప్రత్యేక సదస్సు

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి

“ఏపీ మెడ్ టెక్ ఛాలెంజ్” విధానాన్ని కొనసాగించే యోచన

రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అందించే వైద్య సేవల్లో ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణ (అంకుర సంస్థలు) ద్వారా సానుకూల ఫలితాలు కనిపించాయి. రోగులకు వైద్య సేవలు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంకుర సంస్థలను వైద్య ఆరోగ్య శాఖ త్వరలో ఎంపిక చేయబోతుంది. 4 కేటగిరిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చే అంకుర సంస్థలకు (మొత్తం 12) కూటమి ప్రభుత్వం రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున కలిపి మొత్తం రూ.40 లక్షలను ప్రోత్సాహాకాల కింద త్వరలో ఇవ్వబోతుంది. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఒక అంకుర సంస్థకు మాత్రం కోటి రూపాయల విలువచేసే ‘వర్క్ ఆర్డర్’ ఇస్తారు. ఇందుకు సంబంధించిన చర్యలను ఐటీ డిపార్టుమెంటు ఆగస్టు, 2025 జారీచేసిన జీఓ నెంబరు 33 ప్రకారం అధికారులు తీసుకోనున్నారు. ఈ అంకుర సంస్థ ద్వారా రోగులకు అత్యాధునిక విధానంలో వైద్య సేవలు అందాయి. గడించిన ఈ అనుభవంతో భవిష్యత్తులో క్రమంగా ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత సేవలను విస్తృతం చే సేందుకు “ఏపీ మేడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ” విధానం ఉపయోగపడనుoది. ఈ విధానాన్ని కొనసాగిoచాలని యోచిస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన ‘ఏపీ మెడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటనకు అనుగుణంగా 297 అంకుర సంస్థల నుంచి దరఖాస్తులు రాగా మూడు అంచెల పరిశీలన అనంతరం 18 సంస్థలను వైద్య ఆరోగ్య శాఖ ఎంపికచేసింది. డయాగ్నస్టిక్ టూల్స్ కేటగిరి, పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ కేటగిరి, స్మార్ట్ మానిటరింగ్ అండ్ వేరిబుల్స్ కేటగిరి (శరీరానికి ఉప పరికరాలు అమర్చి), రిమోట్ కేర్ టెలిమెడిసన్ కేటగిరిల వారీగా ఈ అంకుర సంస్థలు ప్రభుత్వాసుపత్రుల్లో తమ సేవలను అందించాయి.

ఏకకాలంలో 18 అంకుర సంస్థల ద్వారా సేవల ప్రయోగం దేశంలోనే తొలిసారి..!

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏకకాలంలో వైద్య సేవల్లో అంకుర సంస్థల ద్వారా వైద్య సేవలను రోగులకు అందుబాటులోనికి తెచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు విజన్ కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ అంకుర సంస్థల ద్వారా రోగులకు అందించిన వైద్య సేవలు, వాటి ఫలితాలను అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు అవకాశం లభించినందున భవిష్యత్తులో ఏఐ ఆధారిత సేవల వినియోగంపై నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఏర్పడిందని తెలిపారు. ఈ అంకుర సంస్థలు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వాసుత్రుల్లో అందించిన వైద్య సేవలు, వాటి ఫలితాలను త్వరలో క్యాథ్ కమిటీ (కమిటీ ఫర్ అప్లైడ్ టెక్నాలజీస్ ఇన్హెల్త్) ముందు నేరుగా వివరిస్తాయని వెల్లడించారు. వీటికి అనుగుణంగా ఉత్తమ సంస్థల ఎంపిక జరుగుతుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆధ్యక్షతన జరిగే సదస్సులో వైద్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటికి నగదు ప్రోత్సాహాకాలను అందచేస్తారు. కమిటీ (కమిటీ ఫర్ అప్లయిడ్ టెక్నాలజీస్ ఇన్హెల్త్)లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐసీఎంఆర్ డైరెక్టర్, ఏఐజీ, హైదరాబాద్, ఇతర ప్రముఖ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.

ఫలితాలిలా..!

ఈ అంకుర సంస్థలు ఫిబ్రవరిలో ప్రారంభించి మార్చి నెలాఖరులోగా మొత్తం 37 రోజుల వ్యవధిలో 12,677 మంది రోగులకు వైద్యుల సమక్షంలో సేవలు అందించాయి. ప్రధానంగా 7,433 మందికి పరీక్షలు చేసి, 15%-25% మందికి టీబీ ప్రాథమిక దశలో ఉన్నట్లు ఓ అంకుర సంస్థ గుర్తించింది. మరో అంకుర సంస్థ 1,200 మందిని స్క్రీన్ చేయగా 34 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని, పది మందికి గ్లూకోమా సమస్య ఉందని వెల్లడైంది. ఇంకో అంకుర సంస్థ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయగా 15 మందిలో అనుమానిత లక్షణాలు కనిపించాయి పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఇంకో అంకుర సంస్థ పరీక్షలు చేసినప్పుడు 30 మంది నవజాత శిశువుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాల్లో గుండె సoబంధించి 323 మందికి పరీక్షలు చేయగా 2.17% మందికి గుండె పనితీరులో రకరకాల సమస్యలు ఉన్నట్లు తేలింది. అలాగే.. 2,100 మంది రోగులతో వైద్యులు ఏఐ స్క్రైబ్ ద్వారా మాట్లాడినందున సాధారణ సమయాల్లో కంటే 70% వరకు సమయం ఆదా అయింది. టీబీ ఉన్న వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, పెయిన్ మేనేజ్మెంట్, నవజాత శిశువులకు రెస్పిరేటరీ సపోర్టు అందించడం, తల్లి గర్భంలో ఉన్న శిశువుల కదలికలు (ముఖ్యంగా గుండె పనితీరు, ఇతర) అంకుర సంస్థలు గమనించాయి. విశాఖ, అనంతపురం, గుంటూరు, పాడేరు, కర్నూలు, కాకినాడ జీజీహెచ్, విజయవాడ, అనంతపురం జీజీహెచ్, తిరుపతి రుయా, విశాఖలోని మానసిక వైద్యశాల, వెస్ట్ గోదావరిలోని చాగల్లు పీహెచ్సీ, తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం ఉప ఆరోగ్య కేంద్రం, తెనాలి జిల్లా ఆసుపత్రి, పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, విశాఖలోని విక్టోరియా ఆసుపత్రి, ఇతర చోట్ల అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి.

ఏఐ ఆవిష్కరణల ఫలితాలు అందరికీ తెలిపేందుకు వీలుగా..!

ఈ ఆవిష్కరణల ద్వారా వచ్చిన ప్రయోజనాల గురించి అమరావతిలో త్వరలో జరిగే సదస్సు ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి డిపార్టుమెంటు వారికి వివరించనున్నారు. అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్లను పిలిపించబోతున్నారు. వైద్య విద్యార్థులు, బోధకులు, ఇతర వర్గాల వారిని కూడా సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ, ఇ-హెల్త్ స్టారప్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్, ఐఐటీ కాన్పూర్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా సదస్సుకు హాజరుకావాలని వైద్య ఆరోగ్య శాఖ ఆహ్వానాలు పంపబోతుoది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *