51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన
వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు
త్వరలో ఇటువంటి చర్యలే మరో ముగ్గురు ప్రొఫెసర్ల పై కూడా….
వీరు కాకుండా మరో 33 మంది వైద్యులకు ఛార్జిమెమోల జారీ
అనధికారిక విధుల గైర్హాజరీలపై ప్రభుత్వం సీరియస్
బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ

అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీరిలో ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లు , 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారని తెలిపారు. ఆరేళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్న వారు కూడా వీరిలో ఉన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్(కాండక్ట్) రూల్స్ (అతిక్రమణ)-3 -1964 అనుసరించి వైద్యులను విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అయినా.. సంజాయిషీ నోటీసులను జారీ చేసి తగిన సమయం ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ స్పందన లేనందున 51 మంది వైద్యులను విధులు నుంచి తప్పించినట్లు మంత్రి శ్రీ సత్యకుమార్ వివరించారు. విధుల నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించే వారిని, అనధికారికంగా విధులకు దూరంగా ఉండే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీ సత్యకుమార్ హెచ్చరించారు. విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు.
సొంత వ్యాపకాలతో విధులకు డుమ్మా
బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు అనుసరించి, విధుల్లో చేరిన వారు అనధికారికంగా డ్యూటీలకు గైర్హాజరవుతున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారు. సొంత వ్యాపకాలతో అనధికారికంగా వీరు విధులకు దూరంగా ఉంటున్నందున ఈ ప్రభావం రోగులకు అందే వైద్య సేవలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మంత్రి శ్రీ సత్యకుమార్ జారీచేసిన ఆదేశాలు అనుసరించి, డీఎంఈ అధికారులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారి వివరాలను సదరు ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి తెప్పించి, జాబితాను సిద్ధం చేశారు. వీరిని అధికారకంగా విధుల నుంచి తప్పించేందుకు అవసరమైన నియమ నిబంధనలను అధికారులు అనుసరించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లే అత్యధికం
అసోసియేట్ ప్రొఫెసర్లలో 8 మంది ఉండగా ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన ఒకరు 2020 ఫిబ్రవరి 7 నుంచి విధులకు దూరంగా ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు 41 మంది ఉండగా ఒకరు 2022 ఆగస్టు 22వ తేదీ నుంచి విధులకు హాజరుకావడం లేదు. కడప, అనంతపురం, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, మార్కాపురం కళాశాలలకు చెందిన వారు వీరిలో ఎక్కువగా ఉన్నారు. ట్యూటర్లలో ఇద్దరు ఉన్నారు. ఒకరైతే ఏడేళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నారు. ప్రొఫెసర్ల కేటగిరిలో ముగ్గురు దీర్ఘకాలం నుంచి విధులకు దూరంగా ఉన్నారు. వీరి విషయంలోనూ కఠిన చర్యలు త్వరలో ఉండబోతున్నాయి. ఐదుగురు ప్రొఫెసర్లు దీర్ఘ కాలo నుంచి విధులకు దూరంగా ఉండగా అధికారుల నోటీసుల జారీ అనంతరం ఇద్దరు విధుల్లో చేరారు
ప్రభుత్వ కఠిన చర్యలతో విధుల్లో చేరిన 11 మంది వైద్యులు
ఏడాదికి మించకుండా విధులకు దూరంగా ఉన్న వారు 11 మంది ఉన్నారు. వీరికి డీఎంఈ అధికారులు ఛార్జిమెమోలు జారీచేయగా విధుల్లో చేరారు. మిగిలిన 33 మంది ఇంకా విధుల్లో చేరలేదు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 31 మంది చొప్పున ఉన్నారు. నిర్ణీత గడువు (ఏడాది) దాటితే ఉద్వాసన వంటి చర్యలు ఉంటాయి. మరోవైపు జీరో వేకెన్సీ పాలసీ కింద నియామకాలను ప్రభుత్వం వెనువెంటనే చేపడుతో oది.
