సంస్కరణలే సంపద సృష్టికి పునాది
సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నాం… పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
పారిశ్రామికాభివృద్ధితోనే సంక్షేమం సాధ్యం
వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు
ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్
గ్రీన్ ఎనర్జీ, ఏఐతో నవయుగం
మహిళలు సంకల్పిస్తే రిజర్వేషన్ బిల్లు అమలు
ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును అందుకున్న చంద్రబాబు
ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు. ముంబైలో ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని కోరుకుంటున్నాను. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఏపీలో అనుమతుల వేగాన్ని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలి. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. దేశంలో సంస్కరణలు అమలు అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ఇది పెట్టుబడులకు కూడా మెరుగైన సమయం. భారత్‌కు అత్యుత్తమ పెర్ఫార్మర్, రిఫార్మర్, విన్నర్ గా ప్రధాని మోదీ ఉన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఏఐ డాక్టర్, ఎఐ ట్యూటర్, ఏఐ అగ్రానమి లాంటి సేవలు అందిస్తున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుంది. దేశంలో ఆర్ధిక సంస్కరణల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండడం నా అదృష్టం. సంస్కరణలకు అనుగుణంగానే నాడు ఉమ్మడి ఏపీలో విజన్ 2020ను అమలు చేశాం. ఆ ఫలాలనే ఇప్పుడు హైదరాబాద్ చూస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశారు. అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని మేం అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉంది.”అని సీఎం చెప్పారు.

విద్యుత్ సంస్కరణలతో మిగులు విద్యుత్ సాధించాం
“గతంలో విద్యుత్ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం. రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణా కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. సౌర, పునరుత్పాదక విద్యుత్‌కు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ అమ్మోనియా లాంటి రంగాల్లో విద్యుత్ ఉత్పత్తి కావాలి. అప్పుడే ఇంధన రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. డీజిల్, పెట్రోలు, గ్యాస్ లాంటి ఇంధనాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి అనేది కీలకం. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనే ప్రయోజనాలు ఉంటాయి. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే అందులో ఏపీ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేశాం. ప్రొజ్యూమర్ అనే విధానంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదన చేసి త్వరలోనే ఎగుమతులు సాధించగలుగుతాం. గతంలో సౌర విద్యుత్ ప్యానళ్ల కోసం చైనాపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేయగలుగుతున్నాం. గ్రీన్ అమ్మోనియా లాంటి వాటి ద్వారా ఈ ఇంధన లక్ష్యాలను చేరుకోగలుగుతాం. డేటా సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. గూగుల్ సంస్థ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. 28న మేం విశాఖలో గూగుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం.” అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఫ్యూచర్ సిటీగా అమరావతి నిర్మాణం
“ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయగలిగాం. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కింది. ఫ్యూచర్ సిటీగా గ్రీన్, బ్లూ సిటీ, నెట్ జీరో కాన్సెప్టుతో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం. మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు. సాధారణ ప్రజలది కూడా. అందుకే పీ4 పేరిట వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. సమాజంలో ప్రతీ ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. పది శాతం మంది ధనవంతులు మార్గదర్శులుగా మారి… సమాజంలో 20 శాతం మంది పేదలను ఆదుకునేలా పీ4 కార్యక్రమాన్ని రూపొందించాం. ఎంబీకే 10-20 అనే ఫార్ములాతో సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారిని సంపద ఆర్జించిన వారు ఆదుకోవటమే ఈ కార్యక్రమం.”అని సీఎం వ్యాఖ్యానించారు.
మహిళల సంకల్పంతో రిజర్వేషన్ బిల్లు అమలు
“మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర సరైన నిర్ణయమే తీసుకుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు మహిళా బిల్లు తెచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయో అర్ధం కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే 50 శాతం మేర సీట్లు పెరుగుతున్నాయి. మహిళలకు, పురుషులకు ఎక్కువ అవకాశాలు దక్కి ఉండేవి. ఇండి కూటమి పార్టీల వైఖరితో మహిళలు అవకాశాలు కోల్పోయారు. దేశంలోని మహిళలంతా గట్టిగా సంకల్పించుకుంటే ఈ బిల్లు ఎలాగైనా అమలు అవుతుంది. పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి. ప్రధాని మోదీ ప్రగతిశీల ఆలోచనలు ఉన్న నాయకుడు. నిబంధనల్ని సరళీకృతం చేయటం, పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తున్నారు. పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తేనే సంపద సృష్టి జరుగుతుంది. 3 దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణను గట్టిగా అమలు చేశాం. భవిష్యత్తులో జనాభా కొరతను మన దేశం ఎదుర్కోనుంది. అందుకే జనాభా నిర్వహణ ప్రక్రియను చేపట్టాలనే ఉద్దేశ్యంతో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందించాం. డబ్బులు ఉంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు పెట్టవచ్చు. కానీ భవిష్యత్తులో జనాభాను సాధించలేం. భారత్ ఫెర్టిలిటీ రేటు 1.9 ఉంది. ఏపీలో అది 1.5 మాత్రమే ఉంది. అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో జనాభా ఉన్న దేశాలే అత్యంత సంపన్న దేశాలుగా మారతాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకువచ్చి అమలు చేయాలని నిర్ణయించాం.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

