చదలవాడలో రాడిసన్ ఫైవ్ స్టార్ హోటల్

నేడు భూమి పూజ చేయనున్న నారా లోకేష్
ఉమ్మడి ప్రకాశం జిల్లాకూ, ఒంగోలు నగరానికి తలమానికం కానున్న రాడిసనల్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 28 శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, జన సేన నాయకుడు కంది రవిశంకర్ చదలవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సాయి విష్ణు చతుర్వాటిక విల్లాల ప్రాంగణంలో హోటల్ రంగంలో ప్రఖ్యాతి చెందిన రాడిసన్ హోటల్ ను నిర్మించనున్నారు. రవిశంకర్ గ్రూప్ – రాడిసన్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ భూమి పూజకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు లోకేష్ భూమి పూజ చేయనున్నట్టు రవిశంకర్ తెలిపారు. మొత్తం అయిదెకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో రాడిసన్ హోటల్ నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. 151 విలాసవంతమైన గదులతో పాటు 600 మంది అతిధులకు సరిపోయేలా కాన్ఫరెన్స్ హాలును నిర్మించనున్నట్టు తెలిపారు. ఒంగోలు-గుంటూరు, చీరాల-ఒంగోలు నేషనల్ హైవేకు అతి సమీపంలో ఉన్న చదలవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టూరిజంతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చగలదని అభిప్రాయడ్డారు. ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం వల్ల 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభ్యమవుతోంది..ఎంతోమందికి పరోక్షంగా ఉద్యోగా, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రవి శంకర్ తెలిపారు.
