ap news

జనవరి 1 నుంచి హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్

  • అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపునివ్వాలి
  • డబులింజన్ ప్రభుత్వంతో వైద్యారోగ్య రంగానికి కొత్త ఊపు
  • వైద్యారోగ్య శాఖలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • రూ.249 కోట్లతో 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ, సెప్టెంబర్ 12: వైద్యారోగ్య రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని అమలు చేయనున్నామని, వైద్యరంగంలో ఇది గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని చెప్పారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటం బయో వ్యాలీని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. శనివారం వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు సందర్శించి.. కొత్తగా నిర్మించిన బ్లాక్, ల్యాబరేటరీని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా లాంఛ్ చేశారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో 500 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, అల్ట్రాసౌండ్‌ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించేలా ఈ సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

డబులింజన్ సర్కారుతో అభివృద్ధి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో మెడికల్‌ సీట్లను 51 వేల నుంచి రెండింతలకుపైగా పెంచారని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన ఘనత భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు మందులు అందుతున్నాయని చెప్పారు. అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఫార్మా రంగానికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా ఉందని, మెడ్‌టెక్‌ పార్కు ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వంటశాలను ఫార్మసీగా… ఆహారాన్నే ఔషధంగా భావించాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్య పద్దతులను మార్చుకోవాలని చెప్పారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, యోగాభ్యాసంతో ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయని అన్నారు. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జేపీ నడ్డా నాయకత్వంలో దేశంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్న నమ్మకం ఉందన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వల్లే ఇటువంటి అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. వైద్యారోగ్య రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని గుర్తుచేశారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌-1 స్థానంలో నిలుపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సహకరించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘హెల్తీ–వెల్తీ–హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌’ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

సాంకేతికతతో సత్వర ప్రగతి

సంప్రదాయ ఆరోగ్య విధానాలను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే వైద్యారోగ్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించగలమన్నారు. సాంకేతికతను అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తే రాబోయే పదేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్‌ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్‌ అమరావతిలోనే ప్రారంభం కానుందని తెలిపారు. అమరావతి గురించి లద్దాఖ్‌లోనూ చర్చించుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అన్ని ప్రాంతాల్లో అమరావతికి గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా అమరావతి గురించి చర్చించుకునే రోజు వస్తుందని చెప్పారు. ఏఐ రంగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రజా ప్రతినిధులు కేశినేని శివనాధ్, బోండా ఉమ, సోము వీర్రాజు సహా వైద్యారోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చప్పట్లు… కేరింతలతో మార్మోగిన అంబేద్కర్ కళా వేదిక

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం వేదికపైకి రాగానే వైద్య విద్యార్థులు, సభికులు పెద్దఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ప్రసంగం సందర్భంగా అడుగడుగునా చప్పట్లతో కళావేదిక మార్మోగింది. దీంతో సీఎం చంద్రబాబు కూడా అంతే ఉత్సాహంతో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమరావతి, సంజీవని ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ కళా వేదికలో పెద్ద ఎత్తున చప్పట్లతో సభికులు హర్షధ్వానాలు తెలిపారు. సభ ముగిసిన తర్వాత సభికుల ఆనందోత్సాహాల్లో పాలుపంచుకుంటూ.. వేదిక మీద నుంచే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *