Medical and Health

ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం

  • మానసిక ఆరోగ్య సేవల విస్తరణ.. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు
  • టెలీ-మానస్‌తో సత్వర కౌన్సెలింగ్.. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ
  • ఆత్మహత్యల నివారణ ప్రయత్నాల్లో అందరి భాగస్వామ్యం అవసరం
  • మానసిక సమస్యలతో బాధపడే వారితో ఓపిగ్గా మాట్లాడాలి.. ఓదార్పునివ్వాలి
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పిలుపు
  • నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బహుముఖ చర్యలు చేపడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సకాలంలో కౌన్సెలింగ్‌తోపాటు వృత్తిపరమైన మానసిక ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఆత్మహత్యల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడేలా, సహాయం కోరడం సహజమైన విషయంగా భావించేలా అవగాహన కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాలు, వృద్ధాశ్రమాల్లో అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలను గుర్తించేలా శిక్షణ ఇస్తోంది. అవసరమైన వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్యల నివారణకు చేపట్టే చర్యల్లో కుటుంబాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సిబ్బంది, సమాజం సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు.

వేలాది మందికి అవగాహన

2023 నుంచి 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 463, కళాశాలల్లో 308 ఆత్మహత్యల నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా సుమారు 40,740 మంది పాఠశాల విద్యార్థులు, 35,598 మంది కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. 307 సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో కార్యక్రమాలు నిర్వహించి 17,308 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా కౌన్సెలింగ్ అందించారు. 3,086 మంది ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ప్రమాద సంకేతాలను గుర్తించే అంశాలపై అవగాహన కల్పించారు. సబ్‌జైళ్లు, జువైనల్ హోమ్స్‌లోనూ 266 అవగాహన, నివారణ కార్యక్రమాలు నిర్వహించారు.

నుజివీడు ట్రిపుల్‌ఐటీలో  సత్ఫలితాలు

విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణకు చేపట్టిన చర్యల్లో భాగంగా నుజివీడు ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక పైలట్ కార్యక్రమాన్ని అమలుచేశారు. నిరంతర కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయంతో చేపట్టిన ఈ కార్యక్రమంతో అక్కడ నమోదైన ఆత్మహత్య కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2021లో రెండు, 2022లో నాలుగు, 2023లో ఒక కేసు నమోదు కాగా 2024, 2025, 2026లో ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కాలేదు. ఈ కార్యక్రమం ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన నగరాలకు దూరంగా, ఒంటరి ప్రాంతాల్లో ఉన్న సున్నితమైన విద్యాసంస్థల్లోనూ ఇలాంటి పైలట్ కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టెలీ-మానస్‌తో మానసిక ఆరోగ్య సేవలు

మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా సేవలు అందించేందుకు టెలీ-మానస్ కీలకంగా మారింది. టోల్‌ఫ్రీ నంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్, సంక్షోభ సమయంలో సహాయం, ప్రమాదాన్ని గుర్తించడం, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలకు రిఫర్ చేయడం వంటి సేవలు అందుతున్నాయి.
రాష్ట్రంలో టెలీ-మానస్ సేవలకు స్పందన క్రమంగా పెరుగుతోంది. 2022లో 523 కాల్స్ రాగా 2023లో 18 వేలు, 2024లో 20 వేలు, 2025లో 17 వేలు, 2026లో ఇప్పటివరకు 31 వేల కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అందిన 86,529 టెలీ-మానస్ కాల్స్‌లో 2.16 శాతం ఆత్మహత్య సంబంధిత ఆందోళనలకు సంబంధించినవే. ప్రస్తుతం విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల, విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో టెలీ-మానస్ కేంద్రాలు ఉన్నాయి. తిరుపతిలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మూడు కేంద్రాలను 24 గంటల హబ్‌లుగా అభివృద్ధి చేసి మానసిక వైద్య నిపుణుల సేవలు, ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని మంత్రి శ్రీ సత్య కుమార్ తెలిపారు.

క్షేత్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 8న పీహెచ్‌సీల పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు జిల్లా మానసిక ఆరోగ్య బృందాల ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో గేట్‌కీపర్ శిక్షణ ఇచ్చారు. సెప్టెంబరు 9న ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

రేపు ప్రత్యేక కార్యక్రమాలు

సెప్టెంబరు 10న ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఈసీ కార్యక్రమాలు, మానవహారాలు, అవగాహన ర్యాలీలు, ‘స్టార్ట్ ద కన్‌వర్సేషన్’ ఫొటో ప్రచారం నిర్వహించనున్నారు. టెలీ-మానస్ సేవలపై, ఆత్మహత్యల నివారణపై మీడియా, రేడియో ద్వారా కూడా అవగాహన కల్పించనున్నారు.

మాట్లాడాలి.. వినాలి.. అండగా నిలవాలి

ఆత్మహత్యలను నివారించడం ఒక్క వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యత మాత్రమే కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కుటుంబాలు, పాఠశాలలు, కళాశాలలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, సమాజం, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
‘ఒక చిన్న సంభాషణ ఒక జీవితాన్ని కాపాడగలదు. మాట్లాడండి.. వినండి.. జీవించండి’ అన్న సందేశంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *