ఖైరతాబాద్ వినాయకుడి తరహాలో ‘డూండీ’ గణపతి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విజయవాడ : ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. సంప్రదాయాలను పాటిస్తూ, పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా ఆరేళ్ల నుంచి 72 భారీ అడుగుల భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ వస్తున్న డూండీ గణేశ్ సేవా సమితి సభ్యులను అభినందించారు. ప్రజలంతా మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. విజయవాడలోని విద్యాధర పురంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల చముఖ వరసిద్ధి మహా గణపతి భారీ విగ్రహం ఆగమన వేడుకను మంత్రి సవిత ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరవాత ఆరేళ్ల నుంచి భారీ ఎత్తున వినాయక నవరాత్రి ఉత్సవాలను డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహిస్తూ వస్తోందన్నారు. ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలను ధీటుగా విజయవాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత… డూండీ గణేశ్ సేవా సమితి మహిళా ప్రతినిధులతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. సంప్రదాయ నృత్యకళాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కార్పొరేషన్ చైర్మన్లు డూండీ రాకేశ్, పేరేపీ ఈశ్వరరావు, సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

