ఉండిలో మెగా ఉచిత వైద్య శిబిరం
- 2,800 మందికి ఉచిత వైద్యం..
- క్యాన్సర్ బాధితులకు చికిత్స
పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి హైస్కూల్ ప్రాంగణంలో శనివారం, ఆదివారం నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 2,800 మంది వైద్య సేవలు పొందారు. ఆశ్రం ఆసుపత్రి, ఏలూరు సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 200 మంది వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని వివిధ విభాగాల్లో ఉచితంగా పరీక్షలు, వైద్యుల సలహాలు, అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, క్యాన్సర్, జనరల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యం, పల్మనాలజీ, ఈఎన్‌టీ, కంటి వైద్యం తదితర సేవలు అందించారు. క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు శిబిరానికి వచ్చేలా 16 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు నిపుణులైన వైద్యుల సేవలు ఉచితంగా అందాయని నిర్వాహకులు తెలిపారు.

