వెనుజులాపై ట్రంప్ దాడికి నిరసనలు
మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలి
సి.పి.ఐ.(ఎం.ఎల్) ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రదర్శన
వెనెజులాపై ట్రంప్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, వెనెజులా అధ్యక్షులు మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆయిల్ దాహాన్నీ, రక్త దాహాన్నీ ఖండిస్తూ సి.పి.ఐ.(ఎం.ఎల్) ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు ఈమనిపాలెం లోని సి.పి.ఐ.(ఎం.ఎల్) కార్యాలయం నుండి హెడ్ పోస్టాఫీస్, చర్చి సెంటర్, ప్రకాశం భవన్, నెల్లూరు బస్టాండ్ మీదుగా నిరసన ప్రదర్శన జరిగింది. “వెనెజులాపై ట్రంప్ ఉగ్రవాద దాడిని ఖండించండి!”, “వెనెజులా అధ్యక్షులు మదురోను, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలి!”, “ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆయిల్ దాహాన్నీ, రక్త దాహాన్నీ ఖండించండి!” అంటూ ప్రదర్శకులు నినదించారు. ప్రదర్శన అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమానికి సి.పి.ఐ.(ఎం.ఎల్) జిల్లా నాయకులు కామ్రేడ్ ఎస్.లలిత కుమారి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో సి.పి.ఐ.(ఎం.ఎల్) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి.వి.ఎన్.స్వామి మాట్లాడుతూ రసాయన ఆయుధాలు ఉన్నాయనే అసత్య ప్రచారంతో గతంలో ఇరాక్ ను ఆక్రమించుకుని, సద్దాం హుస్సేన్ ను హత్య చేసినట్లే, డ్రగ్స్ అనే అసత్యం సాకుతో వెనుజులా దేశంపై, ఆ దేశ అధ్యక్షులు నికోలస్ మదురో పై అమెరికా నేడు అలాంటి కుట్రనే మళ్ళీ అమలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆయిల్ వనరులు ఉన్న దేశాలు అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగి ఉండకపోతే, ఇలా దౌర్జన్యానికి దిగి హింసతో లొంగదీసుకుంటున్నారనీ, ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతంగా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీడిత జాతులు, శ్రామిక ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందనీ ఆయన స్పష్టం చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులు వెనెజులాపై చేసిన దాడిని భారత ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారనీ, భారత ప్రజల నిరసనను కేంద్ర ప్రభుత్వం అమెరికాకు తెలియజేసి, వెనెజులాకు అండగా నిలబడాలనీ డిమాండ్ చేశారు.
అనంతరం ఏ. ఐ. ఎఫ్. టి. యు.(న్యూ) జిల్లా నాయకులు కామ్రేడ్ ఎం. ఎస్. సాయి మాట్లాడుతూ వెనెజులపై అమెరికా చేసిన దాడితో, తనను తాను శాంతి కాముకుడిగా ప్రచారం చేసుకుంటూ నోబెల్ బహుమతి కోసం తహతహలాడుతున్న ట్రంప్ అసలు రంగు ప్రపంచ ప్రజలందరి ముందు బహిర్గతమైందని తెలియజేశారు. వెనెజులా ద్వారా మాదక ద్రవ్యాల ఎగుమతి అసత్యమనీ, అమెరికా ద్వారా యుద్దాల ఎగుమతి జరుగుతుందనేది మాత్రం పచ్చి నిజమనీ ఆయన ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ. ఐ. ఎఫ్. టి. యు.(న్యూ) జిల్లా నాయకులు కామ్రేడ్ కత్తి పేరయ్య, సుల్తాన్ బాషా, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు కామ్రేడ్ వార్తికోట సుబ్బారావు, రైతు కూలీ సంఘం(ఆం. ప్ర.) జిల్లా నాయకులు కామ్రేడ్స్ శ్రీరాములు, పరిటాల కోటేశ్వర రావు, శివరామ కృష్ణయ్య, కోడూరి కోటేశ్వర రావు, వెంకట్రావు , శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.

