శివభక్తుల పేరుతో రాజకీయ దుష్ప్రచారం తగదు

శివయ్య సన్నిధిలో రాజకీయాలు కూలిపోతాయి
శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు
శివభక్తుల పేరుతో రాజకీయ దుష్ప్రచారం చేయడం ఇప్పటికైనా ఆపాలంటూ పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్‌కు శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు (బీఎస్ఆర్) హితవు పలికారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలంలో ఈసారి ఎప్పుడూ లేని విధంగా 49,015 మంది శివస్వాములు మరియు భక్తులు ఒక్కసారిగా తరలి వచ్చారన్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హిందుత్వం పట్ల విశ్వాసం పెరిగింది, శివభక్తి మరింత బలపడిందనే దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన తెలిపారు. భక్తులకు గౌరవం ఉండే వాతావరణం ఏర్పడినప్పుడే ఇంత భారీగా శివస్వాములు వస్తారని ఆయన అన్నారు.
శివభక్తుల ఈ అపార ప్రవాహం సనాతన ధర్మం ఇంకా ఎంత బలంగా నిలిచిందో తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ స్థాయి రద్దీ మధ్యలో కూడా భక్తుల ప్రాణభద్రతే ప్రథమ లక్ష్యంగా ఆలయ యంత్రాంగం, సిబ్బంది నిర్విరామంగా పనిచేశారని గుర్తు చేశారు. కొంతమంది అసాంఘిక శక్తులు భక్తుల మధ్య గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించినా, పరిస్థితి అదుపు తప్పకుండా తక్షణ చర్యలు తీసుకున్నారు. శివస్వాములకు శాంతియుతంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా కొద్ది గంటల్లోనే పరిస్థితిని పూర్తిగా సాధారణ స్థితికి తీసుకొచ్చారని తెలిపారు.
ఆలయాలపై, హిందూ సంప్రదాయాలపై, కూటమి ప్రభుత్వంపై వైయస్ జగన్ విషం చిమ్మే ప్రయత్నమే నిజంగా ప్రమాదకరం మరియు బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేవాలయాల గౌరవాన్ని, భక్తుల భద్రతను, సనాతన ధర్మాన్ని రాజకీయాలకు అతీతంగా కాపాడుతుందని తెలిపారు. శ్రీశైలం పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఈ అపార భక్తి ప్రవాహాన్ని అంకితభావంతో నిర్వహించారని అన్నారు.
శివుడి ఆలయాన్ని రాజకీయ రంగస్థలంగా మార్చే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు అంటూ జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. శివుడి సన్నిధిలో రాజకీయాలు కూలిపోతాయి. భక్తి, బాధ్యత, సనాతన ధర్మమే నిలుస్తాయని తెలిపారు. శ్రీశైలం ఆలయం భక్తి, క్రమశిక్షణ, శాంతికి ప్రతీక. ఆ గౌరవాన్ని నిలబెట్టేందుకు పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంపై, హిందువులపై, సనాతన ధర్మంపై తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. శివుడు రాజకీయాలకు అతీతుడు. ఓం నమః శివాయ అంటూ బోడేపూడి వెంకట సుబ్బారావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
