Medical and Health

సర్వైకల్ క్యాన్సర్.. ముందస్తు నిరోధానికి నేటి నుంచి టీకాలు

14 ఏళ్లు కలిగిన 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా శనివారం నుంచి హెచ్. పి. వి. టీకా

సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడి చర్యల్లో భాగంగా ….

సీఎం శ్రీ చంద్రబాబుచే చీపురుపల్లిలో ప్రారంభం

1,645 ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ

వ్యాక్సినేష‌న్‌కు రూ.14.11 కోట్లు వ్య‌యం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి

గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో 31 శాతం మంది సర్వైకల్ క్యాన్సర్ తో మృతి

మహిళల్లో గర్భశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్) నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 14 ఏళ్లు కలిగిన సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్ పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ (టీకా) ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం శ్రీ చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి జాతీయ స్థాయిలో ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రారంభకార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం శ్రీ చంద్రబాబుతోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడోక ప్రకటన జారీచేశారు
రాష్ట్రంలో కోల్డెన్ (నిల్వ) సదుపాయం కలిగిన 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే బాలికలకు వ్యాక్సిన్ అందిస్తారు. తొలివిడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ వేసేందుకు రూ. 14.11 కోట్లు అవుతుంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్

3 నెలల పాటు కొనసాగింపు

బాలికలకు వాక్సిన్ ను డిస్ట్రిక్ట్ లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే తేదీల్లో ఇస్తారు. అవసరాలకు తగినట్టు కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ ఇంకా అందుతుంది. 14 ఇయర్స్ కలిగిన బాలికలు రాష్ట్రంలో 3,45,377 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 23,957 మంది, తక్కువగా పోలవరం జిల్లాలో 2,777 మంది చొప్పున బాలికలు ఉన్నారు. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు సర్టిఫికెట్ కూడా అందచేస్తారు.
విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ, ఇతర శాఖల సమన్వయంతో టీకా పంపిణీ జరగనుంది. సుమారు 3 నెలలపాటు ఈ వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది.
వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన వివరాలు యు.విన్ డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రియల్ టైం డేటా కింద నమోదు చేస్తారు.

రొమ్ము క్యాన్సర్ తో 53% మంది మృతి

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఎన్సీఆర్పీ) కింద నమోదైన వివరాల ప్రకారం 2021-25 మధ్య 75,000 క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఏడాదికి సగటున 30వేల వరకు మరణాలు సంభవించాయి. 2021-25 మధ్యకాలంలో బ్రెస్ట్, సర్వైకల్, ఒవేరియన్ కారణంగా 38,055 మంది మహిళలు ప్రాణాలు విడిచారు. వీరిలో 20,325 మంది (53%) రొమ్ము క్యాన్సర్, 12,130 మంది మహిళలు (31%) సర్వైకల్ క్యాన్సర్ తో, ఒవేరియ‌న్‌ క్యాన్సర్ తో 5,600 మంది చొప్పున ప్రాణాలు విడిచారని ఎన్. సి. ఆర్.పి. తన నివేదికలో పేర్కొంది. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మహిళల ఆరోగ్యానికి మరింత భరోసా పెరుగుతుందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

దేశంలో అత్యధికంగా వెలుగుచూస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండోస్థానంలో ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పీవీ) వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ 15 నుంచి 14 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. 0.5 ఎంఎల్ టీకా రూపంలో ఇస్తామని, తద్వారా హెచ్. పి. వి.వైరస్ ద్వారా వచ్చే 4 (టైప్-6, 11, 16, 18) రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ బాలికలకు ఇచ్చేముందు అధికారులు వారి తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతిని తీసుకుంటారు.

1645 ఆరోగ్య కేంద్రాల్లో..
రాష్ట్రంలో 1,645 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్రంలో 1645 కోల్డ్ చెయిన్ పాయింట్లు ఏర్పాటు చేయ‌గా వీటిలో అత్య‌ధికంగా శ్రీకాకుళం జిల్లాలో 85 , అటుత‌ర్వాత క‌డ‌ప జిల్లాలో 77 ఏర్పాటు చేశారు. ప్రాథ‌మిక‌, ప‌ట్ట‌ణ, సామాజిక‌ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ‌, జిల్లా, స‌ర్వ‌జ‌న‌(జీజీహెచ్‌) ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో హెచ్‌పివి టీకాలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.

ఎన్. సి. డి. సర్వేలో…..

మహిళలు క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలను ఇంతకుముందే ప్రారంభించింది. రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ సత్యకుమార్ తొలి సంతకాన్ని క్యాన్సర్ సర్వే ఫైలుపైనే పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.71 కోట్ల మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎన్సీడి-04 ద్వారా జరుగుతోంది. ఇందులో సర్వైకల్ క్యాన్సర్ కు సబంధించి హైరిస్క్ కేసులు కూడా అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి.

టీకా ప్రయోజనాలు

హెచ్‌పివి టీకా వేసుకోవ‌డం వ‌ల్ల గర్భాశయ క్యాన్సర్ ను నివారించ‌డంతో పాటు హెచ్‌పీవీ సంక్రమణను తగ్గించి దీర్ఘకాల రోగనిరోధక శక్తి క‌లిగేలా దోహ‌ద‌ప‌డుతుంది. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సుర‌క్షిత‌మైంది. వ్యాక్సిన్ వేసిన చోట‌ కాస్త నొప్పితో పాటు స్వ‌ల్పంగా జ్వ‌రం వ‌స్తుంది. రెండు రోజుల్లో నొప్పి, జ్వ‌రం త‌గ్గిపోతాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారిని 30 నిమిషాల పాటు అక్క‌డే అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచుతారు. అనంత‌రం వారు ఇళ్ల‌కు వెళ్లిపోవ‌చ్చు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్నంతా రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నుంచి ప‌ర్య‌వేక్షిస్తారు. ఏవైనా స‌మ‌స్య‌లు త‌లెత్తితే 24 గంట‌లూ అందుబాటులో ఉండే 104కు కాల్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *