రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు..
ఏడాది పాటు కొనసాగింపు
మద్యం విక్రయాలపై ఇక డిజిటల్ నిఘా..
ప్రతి దుకాణంలో నాలుగు సీసీ కెమెరాలు
లైసెన్సుల రెన్యువల్‌కు 38 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను..
నూతన మద్యం పాలసీ ప్రకటించిన కూటమి ప్రభుత్వం
అమరావతి, ఆంధ్రావని న్యూస్ :
రాష్ట్రంలో 2026-27 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ షాప్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తూ 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఏడాది పాటు కొత్త పాలసీ అమలు చేయనుంది. మొత్తం 3,736 దుకాణాల్లో 3,396 ఓపెన్ కేటగిరీలో ఉండగా, 340 దుకాణాలను గీత కులాలకు కేటాయించారు.
ఎక్సైజ్, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2019-24 మధ్య అమలు చేసిన ఎక్సైజ్ విధానాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న 2024-26 షాప్స్ పాలసీ అనుభవం, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ ఆదాయ అంశాలను పరిశీలించిన అనంతరం 2026-27 పాలసీని ప్రభుత్వం ఖరారు చేసింది.
ప్రస్తుత లైసెన్సుదారులకు తమ దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నులో 38 శాతానికి సమానమైన రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును చెల్లించాలి. దీనితో పాటు వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను, వర్తించే పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. 2026-27లో వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును 2025-26లో ఉన్న రేట్ల ప్రకారమే కొనసాగించారు.
రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును మొదటి విడత వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నుతో కలిపి ఒకేసారి చెల్లించాలి. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఓపెన్ కేటగిరీ దుకాణాలకు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను రూ.23 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.27.2 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35.5 లక్షలుగా నిర్ణయించారు. గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు ఇదే కేటగిరీల్లో వరుసగా రూ.11.5 లక్షలు, రూ.13.6 లక్షలు, రూ.17.8 లక్షలుగా నిర్ణయించారు.
వర్తించే దుకాణాలకు పర్మిట్ రూమ్ లైసెన్స్ తప్పనిసరి. ఇందుకు ప్రత్యేకంగా నిర్ణయించిన పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ పన్నును చెల్లించాలి. వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం నిర్దేశించిన వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. వాయిదాల్లో చెల్లించే లైసెన్సుదారులు మూడు నెలల వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను వాయిదాకు సమానమైన మొత్తానికి బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది.
రెన్యువల్ ఫీజు రూ 35 వేలు
ప్రస్తుత లైసెన్సుదారులు రెన్యువల్ కోసం రూ.35 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎవరైనా లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే ఆ దుకాణాన్ని కొత్తగా డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు రూ.1,000 నాన్-రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించాలి. కనీసం నాలుగు అర్హత కలిగిన దరఖాస్తులు వచ్చిన తర్వాతే డ్రా నిర్వహిస్తారు. కొత్తగా డ్రా ద్వారా కేటాయించిన దుకాణాలకు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను వర్తించదు.

అమ్ముడుపోని లేదా కేటాయించబడని దుకాణాలను అవసరాన్ని బట్టి తిరిగి నోటిఫై చేయడం, ప్రాంతాల వారీగా హేతుబద్ధీకరించడం లేదా స్థానాలను మార్చడం వంటి చర్యలు చేపట్టేందుకు కూడా పాలసీలో అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు.
మద్యం సరఫరా వ్యవస్థపై డిజిటల్ నిఘాను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. ఉత్పత్తి కేంద్రం నుంచి రిటైల్ దుకాణం వరకు మద్యం కదలికను పర్యవేక్షించే ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయనున్నారు. దుకాణాల్లో స్టాక్, అమ్మకాల వివరాలను డిజిటల్‌గా నమోదు చేయాలి. దీనివల్ల మద్యం నిల్వలు, అమ్మకాలపై శాఖకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది.
ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు
ప్రతి మద్యం దుకాణంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. అమ్మకపు కౌంటర్, స్టాక్ ప్రాంతం, వినియోగదారుల ప్రాంతం, పర్మిట్ రూమ్‌ను కెమెరాలు కవర్ చేయాలి. వీటిని ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు. సీసీ కెమెరాలను కావాలనే పనిచేయకుండా చేయడం లేదా వాటిలో జోక్యం చేసుకోవడంపై జరిమానాలు విధించడంతో పాటు పునరావృతమైతే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది.
మద్యం విక్రయాల్లో గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదు. ఎన్డీపీఎల్, నకిలీ మద్యం విక్రయించడం, వివిధ బ్రాండ్ల మద్యం కలపడం, మద్యంలో నీరు లేదా ఇతర పదార్థాలు కలపడం, అనధికారికంగా నిల్వలు ఉంచడం వంటి చర్యలకు పాల్పడరాదు. ఈ నిబంధనల అమలును ఈ-ఇన్వెంటరీ ద్వారా పర్యవేక్షిస్తారు.
రూ 25 లక్షల జరిమానా
అనధికారికంగా మద్యం విక్రయించిన మొదటి నేరానికి రూ.25 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇతర ఉల్లంఘనలకు కూడా పాలసీలో నిర్దేశించిన విధంగా జరిమానాలు, చర్యలు తీసుకుంటారు.
వినియోగదారులకు కూడా ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కల్పించారు. దుకాణాల్లో ఎంఆర్పీ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలి. వినియోగదారులు 14405 టోల్‌ఫ్రీ నంబర్, ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ ద్వారా తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చు. డిజిటల్ చెల్లింపులకు కూడా అవకాశం కల్పించారు.
మద్యం నాణ్యతను ఎక్సైజ్ శాఖకు చెందిన ప్రయోగశాలల ద్వారా పరీక్షించనున్నారు. అక్రమ మద్యం తయారీ, అనధికార విక్రయాలు, ఇతర ఉల్లంఘనలపై తనిఖీలు, చర్యలను కొనసాగిస్తారు. వినియోగదారులకు, లైసెన్సుదారులకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుపతిలో ఇవీ నిబంధనలు..
తిరుపతి నగరంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రత్యేక నిబంధనలు విధించారు. తిరుపతి రైల్వే స్టేషన్–అలిపిరి, లీలామహల్–అలిపిరి–ఎస్వీఆర్ఆర్/ఎస్వీఐఎంఎస్ మార్గాల్లో ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఉండదు. హైవేలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించాలి.
మద్యం సీసాల రీసైక్లింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం తర్వాత రూపొందిస్తుంది. లైసెన్సుదారులు ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలు, లైసెన్స్ నిబంధనలు, సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్–1968, ఏపీ ఎక్సైజ్ రూల్స్–2024తో పాటు సంబంధిత ఇతర చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కొత్త పాలసీ అమలు కానుంది. కొత్త పాలసీకి అనుగుణంగా అవసరమైన నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రకాల పన్నులు, ఫీజులు చెల్లించడం, నిబంధనలను పాటించడం ఆధారంగానే లైసెన్సుల రెన్యువల్, కొనసాగింపు ఉంటుంది.
2026-27 ఎక్సైజ్ షాప్స్ పాలసీ 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.

