ఏపీ పురమిత్రకు జాతీయ అవార్డు.. 123 పట్టణ స్థానిక సంస్థల్లో సేవలు

విజయవాడ / ఆంధ్రప్రదేశ్ | నవంబర్ 27, 2026

1.84 లక్షలకు పైగా ఫిర్యాదుల పరిష్కారం.. 98.8 శాతం నమోదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృత్రిమ మేధ ఆధారిత పట్టణ పాలన వేదిక ‘పురమిత్ర’కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ముంబైలో నవంబర్ 27న జరిగిన పారివర్తన్ అవార్డ్స్–2026లో ‘ఏఐ ఆధారిత ప్రజాసేవల ఆవిష్కరణ’ పురస్కారాన్ని ఈ వేదిక అందుకుంది. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ప్రభుత్వ తరఫున అవార్డును స్వీకరించారు.

రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో పురమిత్ర సేవలు అందిస్తోంది. దాదాపు 47 లక్షల పట్టణ కుటుంబాలకు ఈ వేదిక చేరువైందని, 19.09 లక్షలకు పైగా పౌరులు నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. నమోదైన 1,86,330 ఫిర్యాదుల్లో 1,84,030 పరిష్కరించినట్లు, అంటే 98.8 శాతం పరిష్కార రేటు నమోదైనట్లు వివరించారు.

ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులు, పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఒకే వేదికపై అందిస్తోంది. ఫొటోల ఆధారంగా సమస్యలను గుర్తించే ఏఐ విధానం, జీపీఎస్ ఆధారిత ఫిర్యాదుల పంపిణీ, జీఐఎస్ హాట్‌స్పాట్ మ్యాపింగ్ ఇందులో ఉన్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో వాయిస్, టెక్స్ట్ సేవలకు భాషిణి అనుసంధానం చేశారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *