బ్రౌన్ సేవలు చిరస్మరణీయం
తెలుగు భాషా సాహిత్య పరిరక్షణకు ఎనలేని కృషి
విశాఖలో ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి వేడుకలు
విశాఖపట్టణం : ఆంగ్లమాత కన్నబిడ్డగా జన్మించి, ఆంధ్రమాత ముద్దుబిడ్డగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు సి.పి.బ్రౌన్ అని వక్తలు కొనియాడారు. తెలుగుదండు ఆధ్వర్యంలో అక్షర తపస్వి, బహుభాషా కోవిదుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి వేడుకలను విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు బ్రౌన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
తెలుగు పద సంపద పరిరక్షకుడు
ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ, నిర్లక్ష్యానికి గురై కనుమరుగవుతున్న తెలుగు పదసంపదను సేకరించి, నిఘంటువుల రూపంలో భద్రపరిచి భావితరాలకు అందించిన మహనీయుడు బ్రౌన్ దొర అని కొనియాడారు. మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన సేవలకు తెలుగుజాతి యావత్తు కృతజ్ఞతలు తెలపాలన్నారు.

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మరడాన సుబ్బారావు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాలను సేకరించి, తన సొంత నిధులతో పండితులు, లేఖకులను నియమించి తెలుగు సాహిత్య సంపదను పరిరక్షించిన మహనీయుడు సి.పి.బ్రౌన్ అని అన్నారు. ఆయన కృషి వల్ల తెలుగు సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
ఇతర సాహితీవేత్తలు మాట్లాడుతూ..మహాభారతం, మనుచరిత్ర, వసుచరిత్ర వంటి గ్రంథాలు, వేమన పద్యాలు, తెలుగు అకారాది నిఘంటువుల పరిరక్షణకు బ్రౌన్ చేసిన కృషి అపారమని తెలిపారు. తన జీవితాన్ని, ఆస్తిని సైతం తెలుగు భాషా సాహిత్య వికాసానికి అంకితం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కొచ్చెర్లకోట, గంట్ల శ్రీనుబాబు, అడపా రామకృష్ణ, రాజమన్నార్, పంతుల లలిత, సత్యమాధవి, విజయలక్ష్మి, సుజాత, ఆచార్య శ్రీబాబు, ఆచార్య సూరప్పడు, చేబియ్యం మోహనరావు, బీవీకే కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

