గుంటూరు జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు సెలవు
- అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్
- అంగన్వాడీ కేంద్రాలకు మూడు రోజులపాటు సెలవు
- గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
అర్నాబ్ తుఫాన్ కారణంగా బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని , తీవ్ర గాలులు ఉంటాయని ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ కోరారు. అత్యవసర పనులు ఉంటే మినహా బయటకు రావద్దని సూచించారు. అర్నాబ్ తుఫాన్ పై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలకు బుధవారం, 28వ తేదీన సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే మూడు రోజులు పాటు సెలవును ప్రకటించడం జరిగిందని చెప్పారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, దీనిపై జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, అవసరమైతే ఇప్పటికే సిద్ధం చేసిన 34 పునరావాస కేంద్రాలకు వెంటనే తరలించడం జరుగుతుందని చెప్పారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08632234014 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. రేయింబవళ్ళు పర్యవేక్షణకు సిబ్బందిని నియమించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల పనులను నిర్వహిస్తూనే మరో ప్రక్క తుఫాను పర్యవేక్షణ పనులు సమర్థవంతంగా నిర్వహించుటకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఆసుపత్రుల వద్ద విద్యుత్ ఆటంకం లేకుండా చూడాలి
ఆసుపత్రుల వద్ద ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్ల వద్ద ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించినట్లు తెలిపారు. హై రిస్క్ లో ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. వైద్య సేవలకు ఎటువంటి అంతరాయము ఉండరాదని స్పష్టం చేశారు.
వాగులు, వంకలు, నదులు దాటవద్దు
వాగులు, వంకలు, నదులు ఎవరు దాటువద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను తీవ్రత ఉండటం, నీటి ప్రవాహాలు పెరగటం జరుగుతుందని చెప్పారు. జల ప్రవాహాలు దగ్గర ఈతకు వెళ్లడం, చేపలు పట్టుటకు వెళ్లడం చేయరాదని కోరారు. మీడియా సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.

