జెస్సీ కృపా సౌజన్య..రాజకీయ యువ కెరటం
- గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత విజయం
- 24 ఏళ్ళ వయసులో కార్పొరేటర్ గా గెలుపు
- ప్రత్యర్ధి పార్టీ అడ్డాలో భారీ మెజార్టీతో జయకేతనం
- సామాజిక సమీకరణల సమతుల్యంతో
డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యే అవకాశం
జెస్సీ కృపా సౌజన్య .. గుంటూరు రాజకీయవర్గాల్లో ఇపుడా పేరు ఓ సంచలనంగా మారింది. టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయింది. 24 ఏళ్ళ ఈ యువ కెరటం గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలబడి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేవలం ‘గెలుపు‘ మాత్రమే అయితే పెద్ద విశేషం కాదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో విజయం ఎరుగని పార్టీ జెండాను రెపరెపలాడించారు. గుంటూరు 70వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 911 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ ప్రాంతం గతమంతా కాంగ్రెస్ కీ, ఆ తరువాత వైసీపీకి కంచుకోట. అక్కడ జెండా ఎగురవేయాలని దశాబ్దాలుగా తెలుగుదేశం ఎదురుచూస్తోంది. ఇపుడు జెస్సీ కృపా సౌజన్య తాను గెలిచి ఆ గెలుపును పార్టీ కార్యకర్తలకూ, నాయకులకూ, అధిష్టానానికి కానుకగా అందించింది. ‘చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి .. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల కోసం పనిచేయాలన్న’ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునందుకుని ఆమె అతి చిన్న వయసులో ఎన్నికల్లో నిలబడి ప్రజలిచ్చిన విజయాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి. ‘పదవి అంటే హోదా, అధికారం కాదు..బాధ్యత‘ అని అని భావిస్తున్న జెస్సీ కృపా సౌజన్యకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

డొంకరోడ్డు నుంచి ఉన్నత విద్య వరకు
గుంటూరులోని డొంకరోడ్డు కెన్నెడీ స్కూల్‌లో జెస్సీ విద్యాభ్యాసం ప్రారంభమైంది. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన ఆమె, పాఠశాల జీవితంలోనే సహచరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలు చేపట్టడం ద్వారా తన నాయకత్వానికి పునాది వేసుకున్నారు. ఆ తరువాత ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సమాజంలోని విభిన్న వర్గాలు, వారి సమస్యలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలనే ఆసక్తితో సోషియాలజీని అధ్యయనం చేశారు. ఈ విద్య ఆమెకు సమాజాన్ని మరింత దగ్గరగా పరిశీలించే దృక్పథాన్ని అందించింది.

డిప్యూటీ మేయర్ గా అవకాశం..!?
దళిత సామాజికవర్గానికి చెందిన జెస్సీ కృపా సౌజన్య గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. గుంటూరు నగరం లో అత్యధిక జనాభా గల దళితుల నుంచి గతంలో చుక్కా ఏసురత్నంకు మేయర్ గా, మద్దిరాల రాజేశ్వరరావుకు డిప్యూటీ మేయర్ గా తెలుగు దేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఇపుడు మళ్ళీ గుంటూరు కార్పొరేషన్ లో దళితులకు కీలక పదవి దక్కే అవకాశం ఉంది. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలుగా, మేయర్ గా ఇతర సామాజికవర్గాలకు చెందిన నాయకులు కొనసాగుతున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని ఖచ్చితంగా ఈసారి దళితులకు ఇవ్వటం ద్వారా సామాజిక సమీకరణలను సమతుల్యం చేయనున్నట్టు రాజకీయ పరిశీలకుల అంచనా. ఈ దశలో విద్యాధికురాలైన దళిత సామాజికవర్గానికి చెందిన జెస్సీ కృపా సౌజన్య ను డిప్యూటీ మేయర్ పదవికి ఎంపిక చేసే విషయాన్ని పార్టీ అధిష్టానం అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

