ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పొడిగింపు..?

పరిశీలిస్తామని వెల్లడించిన ఎన్‌ఎంసీ
మిగిలిన ఎన్నారై కోటా 112 సీట్ల భర్తీకి మరో 15 రోజులు గడువు పొడిగించాలని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ రాసిన లేఖపై స్పందించిన ఎన్ఎంసీ
ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు పొడిగింపు, నీట్ యూజీ అర్హత శాతం తగ్గింపు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ అనంతరం 112 ఎంబీబీఎస్ సీట్లు (NRI quota) ఖాళీగా మిగలడంతో, ప్రవేశాల గడువును మరో 15 రోజులు పొడిగించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రభుత్వ సూచనల మేరకు ఎన్‌ఎంసీని కోరింది. ఈ విషయమై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఎన్‌ఎంసీ ఛైర్‌పర్సన్‌కు, కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వైద్య విద్య)కు లేఖ రాశారు.
2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియను అక్టోబరు 26లోగా పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం మొదటి, రెండో, మూడో విడత (మాప్-అప్) కౌన్సెలింగ్‌తో పాటు స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించింది. అక్టోబరు 23న స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయినా 112 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ యూజీ–2026 అర్హత శాతాన్ని తగ్గించాలని, కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు చివరి తేదీని మరో 15 రోజులు పొడిగించాలని విశ్వవిద్యాలయం ఎన్‌ఎంసీకి విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి కూడా ఎంబీబీఎస్ ప్రవేశాల గడువును నవంబరు 20, 2026 వరకు పొడిగించాలని కోరిన విషయాన్ని విశ్వవిద్యాలయం తన లేఖలో ప్రస్తావించింది. అక్టోబరు 26న ప్రవేశాల గడువు ముగిసిన తర్వాత లేఖపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్‌ఎంసీ వెల్లడించింది.
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 95 ఎన్ఆర్ఐ సీట్లు ఖాళీ
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల 9,పద్మావతి మెడికల్ కళాశాలలో 8 చొప్పున ఎన్నారై సీట్లు మిగిలాయి. ఇదే కేటగిరిలో మిగిలిన 95 సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి.
