బడి పిలుస్తోంది

రారండి -రారండి బడి పిలుస్తోంది,
లేత బుగ్గల చిన్నారిలారా రారండి!
వడివడిగా సాగే అడుగుల సవ్వడి,
నవ్వుల పువ్వుల చక్కెరకేళి మనబడి!
విరిసీ విరియని లేత మనసుల బడి,
కలువ కన్నులతో మురపించే బడి!
ముత్యపు చినుకుల తళతళ బడి,
చిరుజల్లులు కురిసే పిల్లల మనబడి!
పిల్లల కలకల రవళి మనబడి,
జలజల సాగే పాటల మణి బడి!
జరజర పద్యాల సందడి బడి,
కుప్పిగంతులు వేసే అలజడి బడి!
సోదర -స్నేహాల గుడి మన బడి,
మమతల కోవెల మన ప్రియ బడి!
చిత్ర విచిత్ర విన్యాసాల బడి,
తుమ్మెద వలే వాలెడి మన బడి!
కథల – పొడుపుకథల రాగాల బడి,
దగదగ మెరిసే నవ వసంత బడి!
రింగు రింగిలా బొమ్మల బడి,
మనసు మనసు కలిసే మన బడి!
జ్ఞాన జ్యోతి వెలిగించే బడి,
అక్షరాలు దిద్దే పసిడి వన్నెల బడి!
భేదాలన్నీ మరిచి రండి రారండి,!
భావితరాలను తీర్చే అమ్మ ఒడి మన బడి!

