కౌలు రైతులను తక్షణమే ఆదుకోవాలి

  • మురసు తుఫాన్‌తో పంటలకు తీవ్ర నష్టం
  • ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలి 
  • ఐదు ఎకరాల పరిమితిని రద్దు చేయాలి
  • ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి. జమలయ్యలు డిమాండ్

మురసు తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురుగాలులు, కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురై దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మురసు తుఫాన్ ప్రభావంతో ఐదు లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తమ సంఘం నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వరి, మిరప, పత్తి, కూరగాయలు, ఆక్వా తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వెల్లడైందన్నారు.  అర్నభ్ తుఫాన్ వల్ల సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, తాజాగా మురసు తుఫాన్ వల్ల మరో ఐదు లక్షల ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టు తెలిపారు.

ఎకరాకు రూ లక్ష చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పంట నష్టం ఎన్యూమరేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ.50,000.వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.70,000.ఉద్యాన పంటలకూ,  ఆక్వా చెరువులకు లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పంటలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు, కౌలురైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు.

ఇవీ డిమాండ్లు..

  • కౌలు రద్దు చేయించాలి
  • భూ యజమానులతో చర్చించి కౌలు రద్దు చేయించాలి
  • దేవాదాయభూములకు ఈ ఏడాది శిస్తు రద్దు చేయించాలి
  • పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుల్లో అయిదెకరాల గరిష్ట పరిమితిని రద్దు చేయాలి
  • పంట భీమా పరిహారాన్ని కూడా కౌలురైతులకు చెల్లించాలి
Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *