క్యూలో నిలబడి ఓటేసిన అచ్చెన్నాయుడు
హోదా పక్కనపెట్టి.. సామాన్య ఓటరుగా క్యూలో నిలబడిన మంత్రి అచ్చెన్నాయుడు
– కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగం
– ఓటు ముందు అందరూ సమానమే
– ప్రజల భవిష్యత్తును నిర్ణయించే శక్తిమంతమైన ఆయుధం ఓటు
అధికారిక హోదా కంటే ప్రజాస్వామ్య విలువలే గొప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆచరణలో చాటిచెప్పారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సామాన్య ఓటరుగా క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సతీమణి కింజరాపు విజయమాధవి, కుమారుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు కూడా ఓటు వేశారు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం ఆశించకుండా ఇతర ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిలబడి తన వంతు వచ్చే వరకు వేచి ఉండటం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడూ సమానమేనన్న సందేశాన్ని అచ్చెన్నాయుడు చాటిచెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో సామాన్యుడైనా, ప్రజాప్రతినిధైనా అందరూ సమానమేనని తన చర్యతో నిరూపించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. ఓటు అనేది కేవలం గుర్తుపై వేసే ముద్ర కాదు.. ప్రజల భవిష్యత్తును, సమాజ గతిని నిర్ణయించే శక్తిమంతమైన ఆయుధం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది. ప్రతి ఓటుకూ విలువ ఉంది. ఒక్క ఓటు కూడా ప్రజాతీర్పును మార్చగలదు అని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగలాంటివని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయడం కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాదని, సమాజ భవిష్యత్తు పట్ల ప్రతి పౌరుడికీ ఉన్న బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, చైతన్యవంతమైన ఓటర్లే బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.


