ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
- మురసు తుఫానుతో ప్రాథమికంగా రూ.1,918 కోట్ల నష్టం
- 1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు
- రాష్ట్రంలో తుఫాను నష్టంపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రూ. 1,918 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు మురసు తుఫాను నష్టాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల వారీగా జరిగిన నష్టాన్ని, చేపట్టిన సహాయక చర్యల వివరాలు సీఎం తెలుసుకున్నారు. వరుసగా రెండు తుపాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. మురసు తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక త్వరితగతిన రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు తాజాగా వెల్లడించిన ప్రాథమిక నష్టం అంచనాల ప్రకారం… తుపాను కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.1,918.55 కోట్ల మేర ప్రాథమిక నష్టం వాటిల్లింది. 1,43,122 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 1,86,063 మంది రైతులపై ప్రభావం పడింది. ఉద్యానవన పంటలు 6,749 హెక్టార్లలో దెబ్బతినగా, 12,586 మంది రైతులు ప్రభావితమయ్యారు. వర్షాల కారణంగా 983 ఇళ్లు, 346 బోట్లు, 220 వలలు కూడా దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు 48–72 గంటల సమయం అవసరమని అధికారులు తెలిపారు.
విద్యుత్, రహదారుల పునరుద్ధరణ చర్యలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని అధికారులు వివరించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 1,103 ప్రభావిత 11 కేవీ ఫీడర్లలో 871 పునరుద్ధరించినట్టు సీఎంకు తెలిపారు. మరో 232 పునరుద్ధరించాల్సి ఉందని స్పష్టం చేశారు. 3,946 దెబ్బతిన్న 11 కేవీ విద్యుత్ స్తంభాల్లో 1,493 పునరుద్ధరించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 11 కేవీ ఫీడర్లన్నీ పునరుద్ధరించాల్సి ఉందన్నారు. ఏపీ ట్రాన్స్కో పరిధిలో ప్రభావితమైన 25 హైటెన్షన్ ఫీడర్లలో 21 పునరుద్ధరించారు. ఆర్ అండ్ బీ పరిధిలో రాష్ట్ర, జిల్లా రహదారులు 760.10 కిలోమీటర్ల వరకు దెబ్బతిన్నాయి. 206 ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లను తొలగించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పరిధిలో 74 గ్రామీణ రహదారులు దెబ్బతినగా, 204.14 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. వీటి పునరుద్ధరణకు రూ.92.08 కోట్ల అవసరమని అంచనా వేశారు.
టెలికాం సేవలు 97 శాతం పునరుద్ధరణ
గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,428 టవర్లలో 30,518 టవర్లు తిరిగి పనిచేస్తున్నాయి. 97.1 శాతం సేవలు పునరుద్ధరించారు. బాపట్ల, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పలుచోట్ల టవర్ల పునరుద్ధరణ జరగాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 59 మండలాలు, 649 గ్రామ పంచాయతీలు ప్రభావితం అయ్యాయి. 336 చోట్ల గుర్తించిన డ్రైనేజీ అడ్డంకులన్నింటినీ తొలగించారు. పారిశుద్ధ్య పనుల కోసం 5,515 బృందాలు, 1,489 జనరేటర్లను వినియోగిస్తున్నారు. పది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎనిమిదింటికి రాకపోకలను పునరుద్ధరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో రెండు ప్రాంతాలకు రాకపోకలు పునరుద్ధరించాల్సి ఉంది.
వరద ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ
ప్రకాశం బ్యారేజీకి 43,500 క్యూసెక్కుల వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. యథాతథంగా ఈ నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. 70 గేట్లలో 60 గేట్లు తెరిచి ఉంచారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా 6,047 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. తమ్మిలేరు ఇన్ఫ్లో 26,000 క్యూసెక్కుల నుంచి 10,200 క్యూసెక్కులకు తగ్గింది. నల్లమడ డ్రెయిన్లో 30,259 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రధాన జలాశయాలు, కాలువల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుపాను కారణంగా బాపట్ల జిల్లాలో ఐదు, గుంటూరు జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్టు గుర్తించారు.
వేగంగా స్పందన…సాయం
తుపాను సహాయక చర్యల్లో 11 ఎస్డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 390 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 5.87 కోట్ల ముందస్తు హెచ్చరిక సందేశాలు ప్రజలకు పంపించారు. బాధితులకు 52,768 ఆహార పొట్లాలు, 43,954 తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. 211 వైద్య శిబిరాలు నిర్వహించారు. తక్షణ సహాయక చర్యల కోసం ప్రభుత్వం జిల్లాలకు రూ.37 కోట్లు విడుదల చేసింది. దెబ్బతిన్న విద్యుత్, రహదారులు, తాగునీటి వ్యవస్థల పునరుద్ధరణతో పాటు ఇతర మౌలిక వసతుల మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

