రాయలసీమలో నీటి సంక్షోభం
- తక్షణం పరిష్కారం చూపాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్
- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన బొజ్జా దశరధరామిరెడ్డి
- కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘం నిర్లక్ష్యం
- సీఎం రాజకీయ దౌత్యం అవసరం
- రాయలసీమ శాశ్వత నీటి భద్రతపై దృష్టి పెట్టాలి
కర్నూల్, ఆంధ్రావని న్యూస్ నెట్ వర్క్ : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలో తీవ్రతరమవుతున్న తాగునీరు, సాగునీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. శ్రీశైలం జలాశయ నిర్వహణపై తక్షణ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖను గురువారం కర్నూలులో జలవనరుల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మహేష్ కు అందచేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బొజ్జాతో పాటు సమితి ఉపాధ్యక్షుడు వాడాల చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు కూడా ఉన్నారు.
వర్షాభావంతో రైతాంగం కుదేలు
ఈ ఏడాది (2026) ఖరీఫ్‌లో జూన్, జూలై వర్షాలతో రైతులు ఆరుతడి పంటలు, వరి నారుమళ్లు సాగు చేసినప్పటికీ, ఆగస్టు నుంచి వర్షాలు నిలిచిపోవడంతో నారుమళ్లు ఎండిపోయి, వరి నాట్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సాధారణ దిగుబడిలో 10-20 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2025–26లో సుమారు 2,259 టీఎంసీల కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చాయి. 2026 మే 31 నాటికి శ్రీశైలం జలాశయంలో బచావత్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం 854 అడుగుల కనీస నీటిమట్టంతో పాటు అదనంగా 60 టీఎంసీల క్యారీ ఓవర్ నిల్వలను మెయింటెన్ చేయాలి. ఈ నిబంధనలను అమలు చేయకపోగా, కనీస నీటి నిల్వ కంటే 60 టీఎంసీలు తక్కువగా నీటిని నిల్వ ఉంచారు. ఇది రాయలసీమ పట్ల తీవ్ర వివక్షతకు నిదర్శనమని లేఖలో విమర్శించారు. 2026–27లో ఇప్పటివరకు సుమారు 218 టీఎంసీలు చేరాయి..అయినా రాయలసీమ నీటి అవసరాల కోసం అవసరమైన చర్యలు తీసుకోలేదన్నారు.
విద్యుత్ ఉత్పత్తితో సీమ జలభద్రతకు ముప్పు
శ్రీశైలంలో తాగునీటి అవసరాలకే నీటి విడుదల పరిమితం చేయాలని కేఆర్ఎంబి సూచించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల కొనసాగించిందని తెలిపారు. ఈ నీటిని శ్రీశైలంలోనే నిల్వ ఉంచి ఉంటే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలకు ఉఫయోగపడేవని లేఖలో బొజ్జా వివరించారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు
1. కనీస నీటిమట్టం : శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టంతో పాటు 60 టీఎంసీల క్యారీ ఓవర్ నిల్వను తప్పనిసరిగా నిర్వహించాలి.
2. విద్యుత్ ఉత్పత్తి నియంత్రణ: బచావత్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి. నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయరాదు.
3. ప్రాధాన్యతా క్రమం: రాష్ట్ర విభజన చట్టం నిర్దేశించిన ప్రాధాన్యత ప్రకారం తాగునీరు, వ్యవసాయ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించాలి.
4. కేంద్రంపై రాజకీయ, దౌత్యపరమైన చొరవ: KRMB, CWC వెనుకబడిన ప్రాంతాల జలహక్కుల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించని నేపథ్యంలో, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రితో చర్చించి అవసరమైన నిర్ణయాలు అమలయ్యేలా చొరవ తీసుకోవాలి.

