నష్టపోయాం..ఆదుకోండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
వారం వ్యవధిలోనే రెండు తుఫాన్ల తాకిడి
తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి
ఆంధ్రావని న్యూస్, అమరావతి : వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం వాటిల్లిందని, మురసు తుఫాన్ కారణంగా ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. తుఫాను నష్టం నుంచి ఉపశమనం కోసం తక్షణం మధ్యంతర ఆర్ధిక సాయం అందించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
తక్షణ సాయంతో రాష్ట్రానికి ఉపశమనం
మురసు తుఫాన్ కారణంగా వ్యవసాయ రంగంలో 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 1,86,063 మంది రైతులు ప్రభావితం అయ్యారని ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్ల నష్టం వాటిల్లిందని…ఉద్యాన పంటలు 6,504.38 హెక్టార్లలో దెబ్బతినగా, 12,178 మంది రైతులు నష్ట పోయారని తెలిపారు. ఈ రంగానికి రూ.337.10 కోట్ల నష్టం జరిగిందని వివరించారు.కేంద్రం నుంచి తక్షణ సహాయం అందితే బాధితులకు ఉపశమనం కల్పించడంతోపాటు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోగలమని చంద్రబాబు స్పష్టం చేశారు.


