కేంద్ర మంత్రులతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ
- కేంద్ర రైల్వే మంత్రి, వాణిజ్యశాఖ మంత్రులతో వరుస భేటీలు
- ఆంధ్రప్రదేశ్‌లో కీలక కనెక్టివిటీ ప్రాజెక్టుల కోసం వినతి
- మిర్చి ఎగుమతుల సంక్షోభాన్ని పరిష్కరించాలి..
- దేశీయ పరిశ్రమలను రక్షించాలని వినతి
- విజయవాడ – కనిగిరి వయా గుంటూరు
- సికిందరాబాద్ – కనిగిరి వయా నరసరావుపేట, గుంటూరు రైలు సర్వీసులు
- పిడుగురాళ్ళ – రామాయపట్నం పోర్టు రైల్వే కారిడార్ కోసం వినతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, కీలక మౌలిక వసతులు మరియు రైతుల సమస్యలపై నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను ప్రత్యేకంగా కలిసి వినతిపత్రాలు అందించారు. రైల్వే మంత్రితో జరిగిన భేటీలో గుంటూరు, నరసరావుపేట మీదుగా సికింద్రాబాద్ – కనిగిరి మధ్య, అలాగే గుంటూరు మీదుగా విజయవాడ – కనిగిరి మధ్య డెము రైలు సర్వీసులను వెంటనే ప్రారంభించాలని కోరారు. వీటితో పాటు పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం, దర్శి, ఒంగోలు మీదుగా రామాయపట్నం పోర్టును అనుసంధానించేలా ప్రత్యేక రైల్వే కారిడార్‌ను మంజూరు చేయాలని కోరారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి డీపీఆర్ సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు గుంటూరు, నరసరావుపేట మీదుగా విజయవాడ – బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించాలని కోరారు.
శ్రీలంకలో ఆగిపోయిన మిర్చి కంటైనర్లు..సమస్య పరిష్కరించాలని వినతి
అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన ఎంపీ కృష్ణ దేవరాయలు శ్రీలంకలో తేమ శాతం వివాదం కారణంగా ఆగస్టు 2026 నుంచి నిలిచిపోయిన 150కి పైగా భారతీయ మిర్చి కంటైనర్ల సమస్యను పరిష్కరించేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి నిబంధనలను సులభతరం చేసి, భారత గుర్తింపు పొందిన ప్రయోగశాలల ధ్రువీకరణ పత్రాలను ఆమోదించేలా చూడాలని కోరారు. అలాగే దేశీయ మానవ కేశాల ప్రాసెసింగ్ పరిశ్రమను ఆదుకునేందుకు ముడి కేశాల కనీస ఎగుమతి ధరను ప్రస్తుతం ఉన్న కేజీకి 65 డాలర్ల నుంచి 120-150 డాలర్లకు పెంచాలని, కస్టమ్స్ నిఘాను కట్టుదిట్టం చేసి దేశీయ విలువ జోడింపును ప్రోత్సహించాలని సూచించారు. మాదేపల్లి, ఏలూరు వంటి ప్రాసెసింగ్ కేంద్రాలలో సుమారు 50 వేల మంది కార్మికులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందిస్తే రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ విస్తరించడంతో పాటు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, స్థానిక పరిశ్రమలు మరియు కార్మికులకు ఎంతో మేలు చేకూరి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

