రామాయపట్నంలో రూ.1.26 లక్షల కోట్ల రిఫైనరీ.. BPCL బోర్డు ఆమోదం
రామాయపట్నం, ప్రకాశం జిల్లా | నవంబర్ 28, 2026
9 ఎంఎంటీపీఏ రిఫైనరీ, 1.5 ఎంఎంటీపీఏ ఇథిలీన్ క్రాకర్ ఏర్పాటు
ప్రకాశం జిల్లా రామాయపట్నంలో సమగ్ర రిఫైనరీ–పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి రూ.1,26,656 కోట్ల పెట్టుబడికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బోర్డు నవంబర్ 28న ఆమోదం తెలిపింది. అంచనా వ్యయంలో ప్లస్ లేదా మైనస్ 20 శాతం మార్పు ఉండవచ్చని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన సమాచారంలో పేర్కొంది. ఈ ప్రాజెక్టును పూర్తిగా అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనుంది.
ప్రతిపాదిత సముదాయంలో ఏడాదికి 9 మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యమున్న రిఫైనరీ, 1.5 మిలియన్ టన్నుల మిశ్రమ ఫీడ్ ఇథిలీన్ క్రాకర్‌తో పాటు అనుబంధ పెట్రోకెమికల్ యూనిట్లు ఉంటాయి. మొత్తం ప్రాసెసింగ్ సామర్థ్యం 10.5 మిలియన్ టన్నులుగా ఉంటుంది. వాణిజ్య కార్యకలాపాలను జూలై 2032లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ, చట్టబద్ధ, నియంత్రణ సంస్థల అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.
అనుబంధ సంస్థలో గరిష్ఠంగా రూ.44,330 కోట్ల ఈక్విటీ పెట్టుబడికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సహా సంబంధిత అనుమతులు అవసరం. దేశీయ ఇంధన, పెట్రోకెమికల్ అవసరాలను తీర్చడం, పాలిమర్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ప్రాజెక్టు లక్ష్యమని బీపీసీఎల్ తెలిపింది.
