జనవరి 1 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
సీఎం చంద్రబాబును ఆహ్వానించిన నిర్వాహకులు
అమరావతి: విజయవాడలో 2027 జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 37వ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధులు.. జనవరి 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. గత 36 ఏళ్లుగా విజయవాడలో పుస్తక మహోత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు.

స్టేడియం కేటాయించాలని వినతి
గత రెండు పుస్తక మహోత్సవాలను నిర్వహించిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంనే ఈసారి కూడా కేటాయించాలని ప్రతినిధులు కోరారు. ఏర్పాట్లు, ఇతర అవసరాల కోసం 2026 డిసెంబర్ 22 నుంచి 2027 జనవరి 16 వరకు స్టేడియంను అందుబాటులో ఉంచాలని వినతిపత్రం సమర్పించారు. గతంలో పీడబ్ల్యూడీ మైదానంలో, ఆ తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పుస్తక మహోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖలు సహకరించాలని కోరారు.
పఠనాభిరుచికి ప్రత్యేక కార్యక్రమాలు
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాహిత్య సమావేశాలు, పుస్తక ప్రియుల పాదయాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల్లో పఠనాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో విజయవాడలో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ లైబ్రరీని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు పుస్తక మహోత్సవాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్ నాయుడు, ఉపాధ్యక్షురాలు జి. లక్ష్మి, కార్యదర్శి కె. లక్ష్మయ్య, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ కార్యదర్శి కాట్రగడ్డ మోహన్ పాల్గొన్నారు.

