కాకినాడకు చెందిన ఆరుగురు మత్యకారులు గల్లంతు : ముమ్మర గాలింపు

రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోస్ట్‌గార్డ్, నౌకాదళ అధికారులతో నిరంతర సమన్వయం

బంగ్లాదేశ్, మయన్మార్‌కు సమాచారం

అమరావతి, నవంబర్ 24: కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారి ఆచూకీ కనుగొనేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, మత్స్యకారులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.

సుబ్బంపేటకు చెందిన గరికాని సింహాద్రి (తండ్రి: మాములు) బోటుతో పాటు మరో పడవ ఈ నెల 4న చేపల వేట కోసం ఒడిశాలోని పారాదీప్ వైపు బయలుదేరినట్లు మంత్రి వివరించారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం, బోట్లు పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లోకి వెళ్లాయి. రెండు బోట్లలో ఒకటి ఈ నెల 18న తిరిగి రాగా, మరో బోటు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 19న కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఈ నెల 19వ తేదీ రాత్రే కోస్ట్‌గార్డ్‌కు లేఖ రాసి తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్ విభాగాలు, చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సమన్వయంతో అన్వేషణ ప్రారంభించాయని వివరించారు. గల్లంతైన బోటులో సుమారు 1,500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కోస్ట్‌గార్డ్ నిర్వహించిన సమావేశంలో బోటు ప్రయాణించిన మార్గం, చివరిగా వెళ్లిన ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కుటుంబ సభ్యులను అధికారులు కోరినట్లు చెప్పారు. వారు సూచించిన సముద్ర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఇప్పటివరకు బోటు జాడ లభించలేదన్నారు.

తుఫాను ప్రభావంతో బోటు దారి తప్పి ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు సైతం సమాచారం అందించినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో అన్వేషణ కొనసాగుతోందని వెల్లడించారు.

గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల వివరాలు

  • సోరాడ కొండల్రావు
  • గుంపల ప్రకాశు
  • తిర్రి నారాయణ
  • సోరాడ చిన్న
  • మెరుగు నారాయణ
  • కండల రాము

బోటులో ఉన్న ఇంధనం, ఆహార నిల్వలను పరిగణనలోకి తీసుకుంటే మత్స్యకారులు క్షేమంగా ఉంటారనే ఆశాభావం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారి ఆచూకీ లభించే వరకు సంబంధిత విభాగాలతో సమన్వయం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆరుగురినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *