ఎంబీబీఎస్ సీట్ల లో 99.88 శాతం భర్తీ
- 6,937 రాష్ట్ర కోటా సీట్లకు గాను 6,929 సీట్లు భర్తీ
- విద్యార్థినులదే పైచేయి.. 61.34 శాతం సీట్లు మహిళలకే
- ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్ల భర్తీ
- నవంబరు 16తో ముగిసిన 2026–27 ప్రవేశాల ప్రక్రియ
అమరావతి, నవంబరు 18: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర పరిధిలోని 6,937 సీట్లకు గాను 6,929 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో మొత్తం 99.88 శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. కేవలం 8 సీట్లు మాత్రమే ఖాళీగా మిగిలాయి. భర్తీ అయిన సీట్లలో విద్యార్థినులే అధికంగా ఉన్నారు. మొత్తం 4,250 మంది విద్యార్థినులు (61.34 శాతం), 2,679 మంది విద్యార్థులు (38.66 శాతం) ప్రవేశాలు పొందారు.
రాష్ట్రంలో మొత్తం 7,465 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, వీటిలో 528 సీట్లు అఖిల భారత కోటాకు కేటాయించారు. మిగిలిన 6,937 సీట్లు రాష్ట్ర కోటా పరిధిలో ఉన్నాయి. నవంబరు 16తో ప్రవేశాల ప్రక్రియ ముగియగా, ఈ వివరాలతో కూడిన నివేదికను ఎన్టీఆర్ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేసింది.

కన్వీనర్ కోటాలో వంద శాతం భర్తీ
రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం 4,581 ఎంబీబీఎస్ సీట్లూ భర్తీ అయ్యాయి. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,631, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,950 సీట్లు ఉన్నాయి. ఈ కోటాలో 2,858 మంది విద్యార్థినులు (62.39 శాతం), 1,723 మంది విద్యార్థులు (37.61 శాతం) ప్రవేశాలు పొందారు.
యాజమాన్య కోటాలో 2,348 సీట్లు భర్తీ
యాజమాన్య కోటాలో మొత్తం 2,356 సీట్లు ఉండగా, 2,348 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో 1,392 మంది విద్యార్థినులు (59.28 శాతం), 956 మంది విద్యార్థులు (40.72 శాతం) ప్రవేశాలు పొందారు. ప్రత్యేక చివరి విడత రెండో కౌన్సెలింగ్ అనంతరం ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎనిమిది సీట్లు మిగిలాయి. వీటిలో తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఏడు, ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఒక సీటు ఉన్నాయి.
ఫీజు తగ్గింపుతో ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి స్థాయి ప్రవేశాలు
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో తొమ్మిది, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడు సీట్లు మిగిలాయి. వీటిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీలోకి మార్చి, ఒక్కో సీటుకు రూ.20 లక్షలుగా ఉన్న ఫీజును రూ.12 లక్షలకు తగ్గించి భర్తీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్ల భర్తీ సాధ్యమైంది.
ప్రత్యేక కౌన్సెలింగ్‌తో 61 సీట్ల భర్తీ
దేశవ్యాప్తంగా 411 ఎంబీబీఎస్ సీట్లు మిగిలినట్లు గత వారం జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్ఆర్ఐ (కేటగిరీ-సి) కోటాలో 69 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎన్ఎంసీ అనుమతితో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండు విడతలుగా ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. దీంతో 61 సీట్లు భర్తీ కాగా, చివరకు ఎనిమిది సీట్లు మాత్రమే మిగిలాయి.
పిడుగురాళ్ల వైద్య కళాశాలలో తొలిసారి ప్రవేశాలు
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలిసారిగా ఎంబీబీఎస్ ప్రవేశాలు జరిగాయి. ఈ కళాశాలలో మొత్తం 50 సీట్లు ఉండగా, ఏడు అఖిల భారత కోటా, 22 కన్వీనర్ కోటా, 21 యాజమాన్య కోటా కింద కేటాయించారు. కన్వీనర్ కోటాలోని మొత్తం 22 సీట్లూ మూడో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి.
సాధారణ కేటగిరీలో 61,593వ ర్యాంకు (524 మార్కులు) నుంచి 1,70,433వ ర్యాంకు (448 మార్కులు) వరకు సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల్లో మహిళలు 61.34 శాతం సీట్లు సాధించడం, వైద్య విద్యలో వారి భాగస్వామ్యం పెరుగుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచింది. కన్వీనర్, యాజమాన్య కోటాలు రెండింటిలోనూ విద్యార్థినులే అధిక సంఖ్యలో ప్రవేశాలు పొందడం విశేషం.
Views: 5

