చిప్ తయారీకి కేరాఫ్‌గా ఏపీ!
- ఏపీ సెమీకండక్టర్ పాలసీకి సవరణలు
- చిప్ తయారీ సంస్థలకు 80 శాతం వరకు పెట్టుబడి రాయితీలు
- తిరుపతిలో 5,000 ఎకరాల్లో ప్రత్యేక సెమీకండక్టర్ పార్క్
- “భారత్‌లో తయారయ్యే చిప్‌లు ఏపీలోనే రూపొందాలని మా లక్ష్యం” : మంత్రి నారా లోకేశ్
అమరావతి, ఆంధ్రావని న్యూస్ : సెమీకండక్టర్ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రోత్సహిస్తోంది. అందుకోసం సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0కు సవరణలు చేస్తూ కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టింది. తాజాగా ఈ నెల 16న జారీ చేసిన జీవో నంబర్ 87 ద్వారా సవరణలను నోటిఫై చేసింది.
40 శాతం అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
కొత్త పాలసీ ప్రకారం సిలికాన్ ఫ్యాబ్ పరిశ్రమలకు కేంద్రం అందించే పెట్టుబడి రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం ప్రోత్సాహకాన్ని అందించనుంది. దీంతో అర్హత కలిగిన పెట్టుబడులపై కేంద్రం, రాష్ట్రం కలిపి మొత్తం 80 శాతం వరకు క్యాపిటల్ సపోర్ట్ లభించనుంది. కాంపౌండ్ సెమీకండక్టర్, ఫోటోనిక్స్, సెన్సార్, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం వరకు, లెగసీ ప్యాకేజింగ్ యూనిట్లకు 50 శాతం వరకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. డిజైన్ నుంచి చిప్ తయారీ, ప్యాకేజింగ్ వరకు భారత్‌లో తయారయ్యే చిప్‌లకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలకు రాష్ట్రం కూడా సమానంగా నిధులు అందించడం, సింగిల్ విండో అనుమతులు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు.

చిప్ తయారీ రంగంలోని అన్ని విభాగాలకు ప్రోత్సాహకాలు
సెమీకండక్టర్ రంగంలోని డిజైన్, యంత్రాలు, ముడిసరుకులు, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ వంటి ఆరు కీలక విభాగాలకు పాలసీ వర్తించనుంది. చిప్ డిజైన్ స్టార్టప్‌లకు కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్ లభించనుంది. యంత్రాలు, ముడిసరుకుల తయారీ సంస్థలకు 48 శాతం వరకు క్యాపిటల్ సపోర్ట్ అందనుంది. పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు అర్హత కలిగిన వ్యయంలో 75 శాతం వరకు కేంద్రం, రాష్ట్రం నుంచి ప్రోత్సాహకాలు లభించనున్నాయి.
తిరుపతిలో 5,000 ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్
సెమీకండక్టర్ తయారీ, అనుబంధ పరిశ్రమలను ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు తిరుపతిలో సుమారు 5,000 ఎకరాల్లో ప్రత్యేక ఏపీ సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, అత్యంత స్వచ్ఛమైన నీరు, ప్రత్యేక పారిశ్రామిక గ్యాస్‌లు, క్లీన్‌రూమ్‌లు, పరీక్షా ప్రయోగశాలలు, లాజిస్టిక్స్, పరిశోధన, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
మూడు ప్రత్యేక సంస్థల ఏర్పాటు
పెట్టుబడిదారులకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఏపీ సెమీకండక్టర్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (APSGIC) ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ తిరుపతిలో తొలుత పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం సెమీకండక్టర్ పార్కుకు తరలించనున్నారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కల్పించేందుకు ఏపీ సెమీకండక్టర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ పొందే ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.10 వేల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ సబ్సిడీ అందించనున్నారు.
రూ.1,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే మెగా ప్రాజెక్టులకు, రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే అల్ట్రా మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు కల్పించనున్నారు. సెమికాన్ 2.0 పరిధిలోకి రాని ఇతర ప్రాజెక్టులకు కూడా ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్‌కు రూ.3 చొప్పున సబ్సిడీ అందించనున్నారు.
ఈ పాలసీ ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. కొత్త పాలసీ వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. తాజా సవరణలతో దేశంలో సెమీకండక్టర్ తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Views: 9

