ఆదివాసుల భూములు వారికే చెందాలి
- గిరిజనేతరులకు అప్పగించే ప్రయత్నం దుర్మార్గం
- రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఝాన్సీ
- పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అధికారులతో చర్చలు
పోలవరం, ఆంధ్రావని న్యూస్ : రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కులను నిరాకరిస్తూ, వారు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను గిరిజనేతర భూస్వాములకు అప్పగించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని రైతుకూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఝాన్సీ విమర్శించారు. పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసులు, అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై వివాదం
పోలవరం మండలం జిల్లెల్లగూడెం పంచాయతీ పరిధిలోని పాత కుంకాల, కొత్త కుంకాల, జిల్లెల్లగూడెం, మనుగోపుల, రెడ్డి నాగంపాలెం గ్రామాల్లో ఆదివాసులు గత 30 ఏళ్లకు పైగా భూములను సాగు చేసుకుంటున్నారని ఝాన్సీ తెలిపారు. ఈ భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారని, పలు ఆందోళనలు కూడా నిర్వహించారని పేర్కొన్నారు.
అయితే, కొందరు గిరిజనేతరులు గతంలో తమకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఉన్నాయని పేర్కొంటూ భూములపై హక్కులు కోరుతున్నారని ఆమె ఆరోపించారు. 2025 జనవరి 22న గిరిజన సంక్షేమ ప్రత్యేక ఉప కలెక్టర్ ఇచ్చిన ఎండార్స్మెంట్ను ఉత్తర్వుగా చూపిస్తూ, హైకోర్టు తీర్పు అమలు పేరుతో ఆదివాసులు సాగు చేస్తున్న భూములను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

1/70 చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల రక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టం అమలులో ఉన్నప్పటికీ, దానిని పక్కనపెట్టి భూములను గిరిజనేతరులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఝాన్సీ అన్నారు. కోర్టు తీర్పుల అమలు విషయంలో గిరిజనుల హక్కులు, సంబంధిత చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గతంలో భూపోరాటంలో కారం పార్వతి ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, 29 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆమె అన్నారు.
వందలాది మంది ఆదివాసుల నిరసన
తమ సాగులో ఉన్న భూములను వదులుకోవాల్సిన పరిస్థితి రావడంతో పాత కుంకాల, కొత్త కుంకాల తదితర గ్రామాల నుంచి వందలాది మంది ఆదివాసీ రైతులు పోలవరానికి తరలివచ్చారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, తమ భూముల సమస్య పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ భూములను ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తిరిగి స్వాధీనం చేసుకుని, గత 30 ఏళ్లుగా తామే సాగు చేసుకుంటున్నామని, వాటిని వదులుకునేది లేదని ఆదివాసులు స్పష్టం చేశారు.
పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన చర్చల్లో రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఝాన్సీ, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుంజం రామారావు, జిల్లా సహాయ కార్యదర్శి సవలం రాంబాబుతో పాటు ఆర్డీవో, ఐటీడీఏ పీవో, డీఎస్పీ, పోలవరం తహసీల్దార్ పాల్గొన్నారు.
Views: 15

