ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు
- విజయవాడలో రూ.45 కోట్లతో తొలి కేంద్రం ఏర్పాటు
- రూ.1,011 కోట్లతో అత్యాధునిక వైద్య సదుపాయాల విస్తరణకు ప్రతిపాదనలు
- ఐవీఎఫ్, బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్, క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్యారోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రూ.1,011 కోట్ల అంచనా వ్యయంతో రోబోటిక్ శస్త్రచికిత్సలు, ఐవీఎఫ్ కేంద్రాలు, బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్, క్యాన్సర్ చికిత్స కేంద్రాలు సహా పలు ప్రత్యేక వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.
తొలిదశలో విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్ శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం విశాఖ కేజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లోనూ ఈ సేవలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఈ అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం మంగళగిరిలోని శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
ఐదు ఐవీఎఫ్ కేంద్రాలు
గుంటూరు, అనంతపురం, విజయనగరం, కాకినాడ, తిరుపతి బోధనాసుపత్రుల్లో ఐదు సంతాన సాఫల్య కేంద్రాలను రూ.17.50 కోట్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విజయవాడలో రూ.17 కోట్లతో అరుదైన వ్యాధుల చికిత్స కేంద్రం, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో రూ.48 కోట్లతో బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంతోపాటు 11 పాత ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.163.52 కోట్లతో అవయవ మార్పిడి కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వృద్ధుల వైద్య కేంద్రాలు, క్లినికల్ స్కిల్స్ అండ్ సిమ్యులేషన్ కేంద్రాలు, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ, స్పీచ్ అండ్ హియరింగ్ కేంద్రాలు, సమగ్ర క్యాన్సర్ వైద్య కేంద్రాల ఏర్పాటుపైనా ప్రతిపాదనలు రూపొందించారు.

ఐదు క్యాన్సర్ కేంద్రాలకు రూ.500 కోట్లు
అనంతపురం, మచిలీపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, ఒంగోలులో ఐదు సమగ్ర క్యాన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ నిధుల కోసం కేంద్ర అణుశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు. రూ.180 కోట్లతో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్, రూ.65 కోట్లతో ఐసీయూల బలోపేతానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా అధికారులు సమర్పించారు.
వెంటిలేటర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
రోగుల అవసరాలకు అనుగుణంగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 850 వెంటిలేటర్లకు అదనంగా ఎన్ని అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించాలని, రోగుల ప్రాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
వైద్య కళాశాలల నిర్మాణాల వేగవంతం
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఎంబీబీఎస్, పీజీ కోర్సులకు అవసరమైన భవనాలు, వైద్య పరికరాలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. 11 వైద్య కళాశాలల్లో పెండింగ్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. పీజీ సీట్లకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదలైన రూ.343 కోట్లను త్వరగా వినియోగించాలని తెలిపారు. ఆసుపత్రుల స్థాయి, రోగుల అవసరాలకు అనుగుణంగా సీటీ స్కాన్లు, ఎంఆర్‌ఐలు, క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.7,369 కోట్ల నిధుల సమీకరణకు ప్రణాళిక
ప్రభుత్వ బోధనాసుపత్రుల నిర్మాణాలు, ఆధునికీకరణకు రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయ పథకం (సాస్కీ) కింద రూ.7,369 కోట్ల ఆర్థిక సహాయం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో రూ.2,340 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు అందాయని, 2027-28లో రూ.2,499.97 కోట్లతో ఆసుపత్రుల ఆధునికీకరణకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన వైద్య పరికరాలను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఆర్.వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

