నవంబర్ 28న విజయవాడలో రైతు సంఘాల నిరసన

విజయవాడ: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నవంబర్ 28న విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో రాష్ట్రంలోని రైతు సంఘాలు ఐక్యంగా నిరసన చేపట్టనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు.

ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 26న నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాన్ని నవంబర్ 28కి మార్చినట్లు తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమానికి నవంబర్ 26తో ఐదేళ్లు పూర్తవుతున్నాయని, ఆ ఉద్యమంలో సుమారు 750 మంది రైతులు మరణించారని పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమంలో 540 రైతు సంఘాలు పాల్గొన్నాయని ఆయన వివరించారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ మాట్లాడుతూ, రైతులకు నష్టం కలిగించే విధానాలు, చట్టాలను ప్రభుత్వం ముందుకు తెస్తోందని ఆరోపించారు. వీటి వల్ల పంటలకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని అన్నారు.

అమెరికా–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమల్లోకి వస్తే రైతాంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా, తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కార్యాచరణపై సమావేశమైన రైతు సంఘాల నాయకులు

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు, పేద రైతులకు ఉపయోగకరంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు.

కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు డి. హరినాథ్ మాట్లాడుతూ కరువులు, వరదలతో రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ రైతులకు తగిన సహాయం అందలేదన్నారు. కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు మాట్లాడుతూ, కౌలు రైతులు, నిజమైన సాగుదారులను గుర్తించి వారికి పంట సాగు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సహాయం, రుణాలు, విత్తనాలు, పురుగు మందులు, అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందించాలని కోరారు.

సాగునీటి నియంత్రణకు సంబంధించిన చట్టాల ద్వారా ప్రజలపై అదనపు భారాలు మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాయకులు ఆరోపించారు. రెండు పంటలు పండే భూములను పరిశ్రమలకు కేటాయించడం వల్ల రైతులు నిరాశ్రయులవుతున్నారని విమర్శించారు.

కిసాన్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు రైతుల పది ప్రధాన డిమాండ్లను సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమాటి మణికంఠేశ్వరావు, సహాయ కార్యదర్శి రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *