కౌలురైతుల ఆత్మహత్యలపై తప్పుడు గణాంకాలు

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
విజయవాడ, నవంబరు 18: రాష్ట్రంలో రైతులు, కౌలురైతుల ఆత్మహత్యల వాస్తవ గణాంకాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య విమర్శించారు. గత రెండున్నరేళ్లలో 380 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ప్రభుత్వం కేవలం 225 మందిగా చూపుతోందని పేర్కొన్నారు.
కౌలుదారు గుర్తింపు కార్డులు ఉన్నవారినే కౌలురైతులుగా పరిగణించడం వల్ల అనేక బాధిత కుటుంబాలకు అన్యాయం జరుగుతోందన్నారు. అధిక సాగు ఖర్చులు, అప్పుల భారం, పంట నష్టాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని తెలిపారు.
2026లో 70 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ముగ్గురినే గుర్తించిందని ఆరోపించారు. నమోదైన కేసుల్లోనూ కేవలం ఏడుగురి కుటుంబాలకే పరిహారం అందించిందన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలురైతుల కుటుంబాలకు ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, సాగుదారు గుర్తింపు కార్డు లేదనే కారణంతో పరిహారం నిరాకరించరాదని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని, కౌలురైతుల ప్రైవేటు అప్పుల మాఫీకి రుణ ఉపశమన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
