బాచుపల్లి సెప్టిక్ ట్యాంక్ ప్రమాదం.. అపార్ట్మెంట్ సంఘాలకు హైడ్రా హెచ్చరిక
భద్రతా పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది తప్పనిసరి.. తనిఖీలు ముమ్మరం
బాచుపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా | నవంబరు 24
బాచుపల్లిలోని డైనెస్ ఆరిక్ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై హైడ్రా అధికారులు భద్రతా చర్యలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు ఏజెన్సీకి పనులు అప్పగించామని చెప్పి అపార్ట్మెంట్ సంఘాలు బాధ్యత నుంచి తప్పించుకోలేవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. అపార్ట్మెంట్ సంఘాలు, నిర్వహణ సంస్థలు, కాంట్రాక్టర్లు కలిసి కార్మికుల భద్రతను నిర్ధారించాలని స్పష్టం చేశారు.
ట్యాంకుల్లో తగిన గాలి ప్రసరణ, విషవాయువుల విడుదల ఏర్పాట్లు ఉండాలని, శ్వాస రక్షణ పరికరాలు లేకుండా ఎవరినీ లోపలికి పంపరాదని సూచించారు. నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలపై తనిఖీలు పెంచి, నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 24న జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు మరణించగా, సంబంధిత ఏజెన్సీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాల నుంచి సేకరించిన నమూనాల ఫోరెన్సిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు.
