ఎన్టీఆర్ ట్రస్ట్ ..ప్రజాసేవలో ఫస్ట్
కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో
ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
తెలుగురాష్ట్రాల్లో ప్రజలకు స్వచ్ఛంద సేవలు అందించడంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఫస్ట్ వస్తుందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఆక్సిజన్ ప్లాంట్‌ని శుక్రవారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ప్రభుత్వాలు చేసే పని కాకుండా స్వచ్ఛందంగా అన్నిరకాల సాయాలు అందించాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రూ. కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిందన్నారు. ట్రస్ట్ సహకారంతో కుప్పం నియోజకవర్గంలో కరోనా బాధితులకు ఔషధాలు, ఆహారం అందించారన్నారు. ట్రస్ట్ సేవాకార్యక్రమాలకు మద్దతుగా నిలిచిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అమెరికా వైద్యులతో ఆన్‌లైన్‌లోనూ అతి తక్కువ ఖర్చుతో వేలాదిమంది కోవిడ్ పేషెంట్లకు వైద్యసాయం అందించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని టెక్కలి ఆసుపత్రులలో ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటులు త్వరలోనే ఆరంభం కానున్నాయన్నారు. వరదలు, విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోన్న సేవలు వేలాది మంది ప్రజలకు చేయూతగా నిలుస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగువారు చిక్కుకున్నప్పుడు ప్రభుత్వం కంటే మిన్నగా ట్రస్ట్ సేవలు అందించిందని ప్రశంసించారు.