అర్నబ్ తుపాన్ .. అనుక్షణం అప్రమత్తత
• 10 శాఖలు, జిల్లాల కలెక్టర్లతో సిఎం చంద్రబాబు రివ్యూ
• బాపట్ల – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం
• ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
• ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతం అవకాశం
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి…ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు…ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని సిఎం సూచించారు.

గర్భిణీలను ముందే ఆసుపత్రులకు తరలించాలి
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…‘తుఫాను వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది….. విద్యుత్ శాఖ పూర్తి సన్నద్దతతో ఉండి విద్యుత్ పునరుద్దరణ వేగంగా జరిగేలా చూడాలి. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలి. భారీ వర్షాలతో వచ్చే వరదతో నీటి వనరులను నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇరిగేషన్ శాఖ తీసుకోవాలి. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ఒక సారి తుఫాను ప్రభావం మొదలై రాకపోకలకు ఆటకం కలిగితే గర్భిణీలు ఇబ్బందులు పడతారు. ఈ వారంలో కాన్పులు అయ్యే గర్భిణీలను ముందుగానే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు
విశాఖ -బాపట్ల మధ్య 28వ తేదీన తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అక్టోబర్ 28 మధ్యాహ్నానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా ఉంది. అక్టోబర్ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అతి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 115 – 125 కిలోమీటర్ల వేగంతో గాలులు…కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి నాలుగు గంటలకు తుఫానుపై బులిటెన్ విడుదల చేయాలని సిఎం సూచించారు.

భారీ, అతి భారీ వర్షాలు
అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపైనా గాలులు, వర్ష ప్రభావం ఉంటుంది. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ.గా ఉంటుందని అంచనా వేయగా…ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు, వ్యవసాయం, విద్యుత్, ఇరిగేషన్, హోం, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

