ముంచుకొస్తున్న తుపాన్

  • 8 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం
  • బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం

తూర్పు మధ్య మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి విశాఖకి 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

ఈ తీవ్రవాయుగుండం రేపు సోమవారం ఉదయానికి తుపానుగా, ఎల్లుండి మంగళవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వివరించారు.

బుధవారం మధ్యాహ్నానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

సహాయక చర్యలు కోసం ముందస్తుగా అనకాపల్లి(1), కాకినాడ (2), కోనసీమ (2), తూర్పుగోదావరి (2), ఏలూరు (2), పశ్చిమగోదావరి (1), కృష్ణా (1), శ్రీకాకుళం (1), బాపట్ల (1), అల్లూరి (1), పోలవరం (1) మొత్తంగా 7NDRF, 8 SDRF బృందాలు మోహరింపు చేశామని, మరికొన్ని బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళ,బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

వేటకు వెళ్ళద్దు

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.తమ బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా కట్టి ఉంచుకోవాలని సూచించారు. తీరప్రాంతాల్లో ఎగసిపడే అలల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.భారీ వర్షాలతో పొంగిపోర్లే వాగులు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

సోమవారం(26-10-26) రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం (27-10-26): విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బుధవారం (28-10-26): శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ; పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *