తుపాను హెచ్చరికలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో పాటు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ అధికారులతో సీఎం రివ్యూ చేశారు. ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేయడంతో పాటు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉందని, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించేలా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
