సంఘటిత పోరాటాలే శరణ్యం
పాలకుల దోపిడీని తరిమికొట్టాలి
సిపిఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో మేడే వేడుకలు
ఒకవైపు వేతనాల కోతలు..మరోవైపు ధరల పెంపు..ఇంకోవైపు అణిచివేతలతో శ్రామిక వర్గం మీద పాలకులు సాగిస్తున్న ముప్పేట దాడిని తిప్పి కొట్టాలని సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివిఎన్ స్వామి పిలుపునిచ్చారు. ఒంగోలు ఈమని పాలెం లోని తరిమెల నాగిరెడ్డి భవన్ వద్ద మేడే సందర్భంగా ఎర్ర జెండాని ఎగుర వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా శ్రామికవర్గం పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాపాడుకోవాలంటే సంఘటిత పోరాటాలే శరణ్యమని, శ్రామికవర్గం రాజ్యాధికారం కోసం పోరాడితేనే సమాజంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ లలితకుమారి మాట్లాడుతూ గిట్టుబాటు ధరల కోసం జరుగుతున్న రైతు ఉద్యమాన్ని, నాలుగు లేబర్ కోడ్ లకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కూ వ్యతిరేకంగా జరుగుతున్న కార్మిక పోరాటాలను ముందుకు తీసుకోవడమే మేడే చికాగో అమరులకు నివాళి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో AIFTU (న్యూ) జిల్లా నాయకులు ఎం.ఎస్ సాయి, కత్తి పేరయ్య, రైతుకూలీ సంఘం (ఆం.ప్ర) నాయకులు వి. శ్రీరాములు, కె. కోటేశ్వరరావు ప్రగతిశీల మేధావుల వేదిక కన్వీనర్ పి గోవిందయ్య, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శాంత కుమారి, రేణుక తదితరులు పాల్గొన్నారు.