హిమాలయాల్లో మేఘా మరో బ్రేక్‌త్రూ.. 6.59 కి.మీ. సొరంగం పూర్తి
చార్‌ధామ్ యాత్రికులకు రైలు ప్రయాణ సౌకర్యం | రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో కీలక ముందడుగు
హైదరాబాద్, నవంబర్ 27: హిమాలయ పర్వతాల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో కీలక మైలురాయిని సాధించింది. ఉత్తరాఖండ్‌లో నిర్మిస్తున్న రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా రుద్రప్రయాగ్ జిల్లాలో 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్–14 ప్రధాన సొరంగం తవ్వకాలను విజయవంతంగా పూర్తి చేసింది. రెండు వైపుల నుంచి చేపట్టిన తవ్వకాలను అనుసంధానించడంతో బ్రేక్‌త్రూ పూర్తయింది. ఈ ఏడాది జూన్‌లో జోజిల టన్నెల్ బ్రేక్‌త్రూ సాధించిన MEIL, తాజాగా హిమాలయాల్లో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది.
చార్‌ధామ్ యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యం
రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి చార్‌ధామ్ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులు రైలు ద్వారా పర్వత ప్రాంతాలకు చేరుకుని, అక్కడి నుంచి రహదారి మార్గంలో యాత్ర కొనసాగించేందుకు వీలుంటుంది. యాత్రా సీజన్‌లో రహదారులపై రద్దీ, ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.
రెండు వైపుల నుంచి తవ్వకాలు
మొత్తం 6.59 కిలోమీటర్ల టన్నెల్–14లో సుమేర్‌పూర్ పోర్టల్ నుంచి 4.7 కిలోమీటర్లు, మారోరా పోర్టల్ నుంచి 1.79 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. రెండు వైపుల నుంచి సాగిన పనులను విజయవంతంగా అనుసంధానించారు.సుమేర్‌పూర్ వైపు నివాస ప్రాంతాల కింద సుమారు 110 మీటర్ల మేర వదులైన మట్టిలో సొరంగం తవ్వడం సవాలుగా మారింది. భూమి స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రీ-ఎక్స్‌కవేషన్, మల్టీ-డ్రిఫ్టింగ్ వంటి ప్రత్యేక సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు.
మారోరా వైపు కొండ వాలుల స్థిరత్వం కోసం 30–35 మీటర్ల లోతు మైక్రోపైల్స్, 15–20 మీటర్ల పొడవైన రాక్ బోల్ట్స్, కన్సాలిడేషన్ గ్రౌటింగ్ పద్ధతులను అమలు చేశారు. భూమి కుంగుబాటు, భూసేకరణ, నివాస గృహాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం అనంతరం 2024 మార్చిలో ప్రధాన సొరంగం తవ్వకాలు ప్రారంభమయ్యాయి.
భద్రతకు ప్రాధాన్యం
సమీప నివాస ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండు పోర్టళ్ల వద్ద పగటిపూట మాత్రమే నియంత్రిత బ్లాస్టింగ్ నిర్వహించారు. సొరంగంలో గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. హిమాలయాల్లో తీవ్రమైన చలి, భారీ వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇంజినీర్లు, జియాలజిస్టులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు సమన్వయంతో పనిచేశారు. ఆధునిక యంత్రాలు, ప్రత్యేక నిర్మాణ పద్ధతులను వినియోగిస్తూ నాణ్యత, భద్రతకు ప్రాధాన్యమిచ్చారు.
ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారి
రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాఖండ్‌లోని మారుమూల పర్వత ప్రాంతాలకు మెరుగైన రవాణా అనుసంధానం ఏర్పడనుంది. స్థానిక ప్రజలతో పాటు యాత్రికులు, పర్యాటకులకు ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయి. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి రంగాలకు కూడా ఊతం లభించనుంది.టన్నెల్–14 బ్రేక్‌త్రూతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది. అత్యంత క్లిష్టమైన హిమాలయ భూగర్భ పరిస్థితుల్లోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లడంలో MEIL సామర్థ్యాన్ని ఈ విజయం చాటిచెప్పింది.

