ఏపీలో 64 ఆయుష్ కేంద్రాల ఆధునీకరణకు రూ.12.80 కోట్లు
ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షలు.. 33 చోట్ల భూమి సిద్ధం
విజయవాడ | నవంబరు 27
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయుష్ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు 64 డిస్పెన్సరీలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ ఆయుష్ మిషన్ 2026–27 వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ.12.80 కోట్లు ఆమోదించింది. ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు.
పాత భవనాల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త భవనాల నిర్మాణంతో పాటు అన్ని కేంద్రాల్లో ఒకే తరహా సదుపాయాలు కల్పించనున్నారు. రోగుల నిరీక్షణ గది, వైద్యుల సంప్రదింపు గది, మందుల నిల్వ విభాగం, పరీక్షల ప్రయోగశాల, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. 64 కేంద్రాల్లో 33 చోట్ల భూమి సిద్ధంగా ఉండగా, మిగిలిన 31 కేంద్రాలకు భూమి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఎనిమిది కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.
