షర్మిల సంచలన ప్రకటన

sharmila announcement

  • కుమార్తె వివాహ వేదికను మారుస్తున్నట్టు వెల్లడి
  • యలహంక ఇంట్లో కాకుండా మరోచోట అంజిలి వివాహం
  • వివాదాలకు తావులేకుండా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి
  • తనది కాని ఆస్తిపై ఆశపడే నీచత్వం నాకు లేదు : షర్మిల

తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేదికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కీలక ప్రకటన చేశారు. యలహంకలోని ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో వివాహ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనకు చెందని ఆస్తి కోసం ఆశపడే నీచత్వం తనది కాదని షర్మిల స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం తనకు, తన పిల్లలకు వచ్చిందని పేర్కొన్నారు. ఇది దేవుడి సాక్షిగా నిజమని తెలిపారు.తన పిల్లల హక్కు కావడంతో పాటు, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగిన ఇల్లు కావడంతో, తన కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడే వివాహం జరిపించాలని భావించినట్లు వివరించారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని, అయితే తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న తన కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి తన కుమార్తె గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.తన కుమార్తె అంజిలి వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా వివాహాన్ని జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని షర్మిల పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాబోయే నవదంపతులపై తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఆకాంక్షించారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *