ఆర్య వైశ్యులా…కాపులా..!

- ఐవీఆర్ఎస్ సర్వేతో స్పష్టత
- అబిప్రాయసేకరణ జాబితాలో ఇద్దరు వైశ్య.. ఒక కాపు
- నల్లమల్లి బాలు, ఆయన సతీమణి శ్రీ శిల్ప (కాపు), బీఎంఆర్ పేర్లు
- కొత్తగా తెరమీదకు బిఎంఆర్
- శిద్దాకు సీటుపై అధిష్టానం నిరాకరణ
ఒంగోలు మేయర్ సీటును తెలుగుదేశం పార్టీ ఆర్య వైశ్యులు..లేదా కాపులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐవిఆర్ ఎస్ సర్వేలో ముగ్గురు పేర్లతో అభిప్రాయసేకరణను ప్రారంభించింది. నల్లమల్లి బాలు (వైశ్య), ఆయన సతీమణి నల్లమల్లి శ్రీ శిల్ప (కాపు)తో పాటు కొత్తగా బొమ్మిశెట్టి రవికుమార్ (బిఎంఆర్) (వైశ్య)పేరు తెరమీదకు వచ్చింది. వైఎస్ఆర్ సీపీ వైశ్య సామాజికవర్గానికి చెందిన కుప్పం ప్రసాద్ ను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించటంతో తెలుగుదేశం కూడా తన వైఖరి మార్చుకుని అదే సామాజికవర్గం అభ్యర్ధిని రంగంలోకి దించాలని నిర్ణయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్య వైశ్య సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సమీప బంధువు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా పార్టీ అధిష్టానం నిరాకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి మేయర్ స్థానం కోసం పోటీపడుతున్న నల్లమల్లి కుటుంబంతో పాటు ప్రముఖ బంగారు నగల వ్యాపారి బిఎంఆర్ ను తెరమీదకు తీసుకొచ్చినట్టు తెలిసింది. నల్లమల్లి కుటుంబంలో శ్రీ శిల్పకు కేటాయిస్తే ఒక వైపు వైశ్యులనూ, మరో వైపు కాపులను సంతృప్తి పర్చ వచ్చనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ స్థానం శ్రీశిల్పకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగుదేశం హై కమాండ్ నిర్వహిస్తున్న IVRS సర్వే వినండి
