రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల పై దాడులు
28 జిల్లాల్లో 70 హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహార భద్రత శాఖ దాడులు
ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు
25 సంస్థల మూసివేత..
30 కేసుల నమోదు
దాడుల నివేదికను మంత్రి సత్యకుమార్‌కు సమర్పించిన అధికారులు
అమరావతి : ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత శాఖ అధికారులు శనివారం విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 28 జిల్లాల్లో ఒకేసారి చేపట్టిన ఈ తనిఖీల్లో 70 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థలను పరిశీలించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 25 సంస్థలను మూసివేశారు. 30 చట్టపరమైన కేసులు నమోదు చేశారు. మిగిలిన 15 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలు, తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను అధికారులు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు సమర్పించారు.

ఈ రాష్ట్రవ్యాప్త తనిఖీలను ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జి. వీరపాండియన్, ఐఏఎస్, ఐపీఎం, ఆహార భద్రత శాఖ సంచాలకులు, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం డీజీ శ్రీ సి. అరుణ్‌బాబు, ఐఏఎస్ పర్యవేక్షించారు. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాస్‌తో పాటు 40 మంది ఆహార భద్రత అధికారులు, 13 మంది సహాయ ఆహార నియంత్రణ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్ డిపార్ట్మెంట్ శనివారం రాత్రి ఓ ప్రకటన జారీ చేసింది.
25 సంస్థల మూసివేత
పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలను తీవ్రంగా ఉల్లంఘించిన 25 రెస్టారెంట్లు, ఆహార సంస్థలను అధికారులు మూసివేశారు. ముఖ్యంగా వంటగదుల్లో అపరిశుభ్ర పరిస్థితులు, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించారు.
విజయవాడలోని భవానీపురం క్యాసరోల్ రెస్టారెంట్ వంటగదిలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికక్కడే వంటగదిని మూసివేశారు.

మిగిలిన 15 సంస్థలకు నోటీసులు
అవసరమైన పరిశుభ్రత, పారిశుద్ధ్య, నిర్వహణ ప్రమాణాలను పాటించని మిగిలిన 15 ఆహార సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్పులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా వ్యాపారం.. 30 కేసులు
చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న సంస్థలపై మొత్తం 30 కేసులు నమోదు చేశారు. ఇందులో 10 కేసులు చెల్లుబాటు అయ్యే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించినందుకు నమోదు చేశారు. మిగిలిన 20 కేసుల్లో హోటళ్ల వంటగదులు, ఆహార తయారీ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

100 కిలోలకు పైగా పాత ఆహారం ధ్వంసం
తనిఖీల సందర్భంగా 100 కిలోలకు పైగా వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం ఫ్రీజర్లలో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వినియోగానికి అనువుగా లేని ఈ ఆహారాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
తనిఖీల్లో బయటపడిన ప్రధాన లోపాలు
ఆహార తయారీ, నిల్వ, వంటగదుల నిర్వహణలో పలు తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు.
కృత్రిమ రంగులు, రుచిని పెంచే పదార్థాలు:
కొన్ని సంస్థల్లో అనుమతిలేని కృత్రిమ ఆహార రంగులు, రుచిని పెంచే పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

వృక్ష నూనెలతో తయారు చేసిన పన్నీర్
స్వచ్ఛమైన పాలకు బదులుగా వృక్ష నూనెలను ఉపయోగించి తయారు చేసిన పన్నీర్‌ను కొన్ని సంస్థల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ఫ్రీజర్లలో అపరిశుభ్రంగా ఆహార నిల్వ:
వండిన శాకాహార, మాంసాహార పదార్థాలను అపరిశుభ్రమైన ఫ్రీజర్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల ఆహారాన్ని మూతలు, కవర్లు లేకుండా నిల్వ ఉంచారు. నిల్వ చేసిన ఆహారాన్ని తేదీల వారీగా మార్చే విధానాన్ని కూడా పాటించడం లేదని అధికారులు గుర్తించారు.
మూసివేసిన సంస్థలు
తనిఖీల్లో మూసివేసిన సంస్థల్లో శాఖ వెల్లడించిన కొన్ని వివరాలు:
1. క్యాసరోల్ రెస్టారెంట్, భవానీపురం, విజయవాడ
2. ఆప్నా పంజాబీ ఢాబా, అనకాపల్లి
3. పాల్గన్ ఢాబా, జొన్నవాడ రోడ్డు, నెల్లూరు
4. పవని రెసిడెన్సీ హోటల్, ట్రంక్ రోడ్డు, నెల్లూరు
5. వాయుపుత్ర టిఫిన్స్ అండ్ మీల్స్ రెస్టారెంట్, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం
6. హోటల్ మంజునాథ భవన్, ఆర్టీసీ బస్టాండ్, తిరుపతి
ఇకపై తరచూ తనిఖీలు
శనివారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త తనిఖీలు ఒక్కరోజుతో ముగిసేవి కావని ఆహార భద్రత శాఖ స్పష్టం చేసింది. ఆహార వ్యాపార సంస్థల్లో నిబంధనల అమలుపై పూర్తి మార్పు వచ్చే వరకు తనిఖీలు తరచూ కొనసాగుతాయని తెలిపింది.
అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించింది. వంటగదులు, ఫ్రీజర్లు, ఆహార నిల్వ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, ఆహార పదార్థాలను సక్రమమైన పద్ధతిలో నిల్వ చేయాలని స్పష్టం చేసింది.
గత తనిఖీల్లోనూ ఉల్లంఘనలు
శనివారం రాష్ట్రవ్యాప్త తనిఖీలకు ముందు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన నగరాల్లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లోనూ పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆహార నిల్వ విధానం, వంటగదుల పరిశుభ్రత, ఆహార తయారీ ప్రదేశాల నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు.

మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో కఠిన చర్యలు
ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన, సమతుల్యమైన ఆహారం అందేలా ఆహార భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉందని ఆయన పేర్కొన్నారు.ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

