పత్తిపై కస్టమ్స్ కత్తి
- పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు పొడిగింపు
- స్వదేశీ పత్తి రైతాంగానికి శరాఘాతం!
- వస్త్ర పరిశ్రమలకు చౌక పత్తి కావాలి..
- దేశీయ పత్తి రైతులకు గిట్టుబాటు ధర ఏది..!?

భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. కోట్లాది మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఎంత కీలకమో, వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పారిశ్రామిక రంగం కూడా అంతే కీలకం. ముఖ్యంగా పత్తి సాగు, పత్తి ఆధారిత వస్త్ర పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పత్తిని పండించే రైతు నుంచి నూలు తయారీ, వస్త్రాల ఉత్పత్తి, రెడీమేడ్ దుస్తుల తయారీ వరకు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది.
వ్యవసాయ ఉత్పత్తిదారులైన రైతుల ప్రయోజనాలు, ఆ ఉత్పత్తులను ముడిసరుకుగా వినియోగించే పరిశ్రమల ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఈ సమతుల్యతను దెబ్బతీసే విధంగా కనిపిస్తోంది. 2026 అక్టోబర్ 30న కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు గడువును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు చౌకగా అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ పత్తి రైతాంగంలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పత్తి మార్కెట్‌కు దేశీయ పంట వస్తున్న సమయంలో దిగుమతులపై సుంకం మినహాయింపును పొడిగించడం వల్ల స్వదేశీ పత్తి రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ నిర్ణయాన్ని కేవలం వస్త్ర పరిశ్రమలకు కల్పించిన ఆర్థిక వెసులుబాటుగా మాత్రమే చూడకూడదు. దేశీయ పత్తి మార్కెట్, రైతుల ఆదాయం, కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు విధానం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలతో ముడిపెట్టి పరిశీలించాల్సిన అవసరం ఉంది.

దిగుమతి సుంకం మినహాయింపు ఏమిటి .. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏమిటి..?
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2026 మే 30న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 19/2026-కష్టమ్స్ ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పత్తిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ (AIDC) మినహాయింపు కల్పించింది.
ఈ మినహాయింపు కస్టమ్స్ టారిఫ్ హెడ్డింగ్ 5201 కిందకు వచ్చే ముడి పత్తికి వర్తిస్తుంది. సాధారణంగా ఉండే 11 శాతం దిగుమతి సుంకం భారాన్ని తొలగించడం ద్వారా విదేశీ పత్తిని దిగుమతి చేసుకునే పరిశ్రమలకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు.
తాజాగా అక్టోబర్ 30న నోటిఫికేషన్ నెం. 35/2026-కష్టమ్స్ ద్వారా ఈ మినహాయింపు గడువును మరో రెండు నెలలు, అంటే 2026, డిసెంబర్ 31 వరకు పొడిగించారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ చివరి వారం నుంచి పత్తి తీత, మార్కెట్‌కు పంట రాక ప్రారంభమవుతుంది. రైతులు నెలల తరబడి పెట్టుబడులు పెట్టి పండించిన పత్తి మార్కెట్‌కు వస్తున్న సమయంలో విదేశీ పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును కొనసాగించడం దేశీయ పత్తి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పటికే గతంలో ఇచ్చిన సుంకం మినహాయింపు కారణంగా దిగుమతి చేసుకున్న పత్తి పరిశ్రమల వద్ద నిల్వలు ఉన్నాయనే అంశం కూడా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో మళ్లీ దిగుమతులకు ప్రోత్సాహం కల్పించడం వల్ల
దేశీయ పత్తి కొనుగోళ్లపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.దిగుమతి పత్తి అందుబాటులో ఉందనే కారణంతో దేశీయ పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు, కొనుగోలుదారులు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

పత్తి మార్కెట్లో రైతుల కంటే దళారులదే పైచేయి!
దేశంలో పత్తి మార్కెట్ వ్యవస్థను పరిశీలిస్తే రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రతి ఏడాది ఉత్పత్తి అయ్యే పత్తిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొనుగోలు చేసే పరిమాణం మొత్తం ఉత్పత్తితో పోలిస్తే పరిమితంగానే ఉంటోంది. సాధారణంగా 20 నుంచి 30 శాతం లోపు పత్తినే CCI కొనుగోలు చేస్తోందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
మిగిలిన పత్తి కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు, జిన్నింగ్ మిల్లులు, దళారుల పాత్ర కీలకంగా ఉంటుంది. రైతులకు మార్కెట్ ధరపై నిర్ణయాత్మక అధికారం లేకపోవడం, నిల్వ చేసుకునే సౌకర్యాలు లేకపోవడం, అప్పుల ఒత్తిడి కారణంగా పంటను వెంటనే విక్రయించాల్సి రావడం వంటి సమస్యలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు కొనసాగితే కొనుగోలుదారులకు మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తుంది. ఇది దేశీయ రైతుల బేరసారాల శక్తిని మరింత బలహీనపరిచే ప్రమాదం ఉంది. అందువల్ల పత్తి దిగుమతులపై తీసుకున్న నిర్ణయాన్ని రైతుల మార్కెట్ హక్కులు, కొనుగోలు వ్యవస్థ, ధరల నియంత్రణతో ముడిపెట్టి చూడాల్సి ఉంటుంది.

వస్త్ర పరిశ్రమలకు ప్రయోజనం.. రైతులకు నష్టం జరిగే ప్రమాదం!
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వస్త్ర పరిశ్రమలకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాల నుంచి తక్కువ వ్యయంతో పత్తిని దిగుమతి చేసుకోవచ్చు. స్పిన్నింగ్ మిల్లులకు అవసరమైన ముడిసరుకు అందుబాటులో ఉంటుంది. చిన్న, మధ్య తరహా వస్త్ర పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. నూలు, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల తయారీలో అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేక నాణ్యత కలిగిన పత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది.
వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడినప్పుడు దిగుమతులు కొంత ఉపశమనం కలిగించవచ్చు. పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతే. ఎందుకంటే ఈ పరిశ్రమలు కూడా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దేశ ఎగుమతులకు, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
కానీ పరిశ్రమల ప్రయోజనాల కోసం దేశీయ రైతాంగాన్ని నష్టపరిచే విధానాలను అనుసరించడం ఎంతవరకు సమంజసం?
దిగుమతి పత్తి చౌకగా లభించడం వల్ల పరిశ్రమలకు తగ్గిన వ్యయం వినియోగదారులకు చేరుతుందనే హామీ లేదు. అది పరిశ్రమల లాభాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. అటువంటప్పుడు రైతుల ఆదాయాన్ని తగ్గించి పరిశ్రమల లాభాలను పెంచే విధానానికి ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది?

దేశీయ పత్తి రైతులపై దిగుమతుల ప్రభావం
భారతదేశంలో లక్షలాది మంది రైతులు పత్తి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. పత్తి సాగు అత్యధిక పెట్టుబడులతో కూడుకున్నది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, యంత్రాల అద్దెలు, భూమి కౌలు వంటి వ్యయాలు ఏటేటా పెరుగుతున్నాయి.
ప్రత్యేకించి కౌలురైతులు భూమి కౌలు చెల్లించడంతోపాటు పంట సాగుకు అవసరమైన మొత్తం పెట్టుబడిని అప్పులు చేసి సమకూర్చుకుంటున్నారు. పంట దిగుబడి తగ్గినా, మార్కెట్లో ధర పడిపోయినా నష్టాన్ని భరించాల్సింది వారే.ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి పత్తిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు కొనసాగించడం వల్ల ప్రధానంగా మూడు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
1) దేశీయ పత్తి ధరలపై ఒత్తిడి
విదేశాల నుంచి తక్కువ వ్యయంతో పత్తిని దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు దేశీయ స్పిన్నింగ్ మిల్లులు దిగుమతి పత్తివైపు మొగ్గు చూపవచ్చు. దీనివల్ల దేశీయ పత్తికి డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి ఏర్పడవచ్చు.
2). రైతుల బేరసారాల శక్తి తగ్గడం
దిగుమతి పత్తి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్నప్పుడు దేశీయ పత్తి కొనుగోలుదారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన సమయంలో రైతులు అప్పులు తీర్చాల్సిన ఒత్తిడితో పత్తిని వెంటనే విక్రయించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉంది.
3) పెట్టుబడులకు తగిన ఆదాయం లభించకపోవడం
ఇప్పటికే సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దిగుబడి తగ్గడం, మార్కెట్ ధరలు పడిపోవడం రెండూ కలిసివస్తే రైతులకు తీవ్ర నష్టాలు తప్పవు. పెట్టుబడులు తిరిగి రాక అప్పులు పెరుగుతాయి. తదుపరి పంట సాగు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆర్థిక సంక్షోభం రైతుల ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.
అయితే దిగుమతి సుంకం మినహాయింపు వల్లనే దేశీయ పత్తి ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేం. అంతర్జాతీయ ధరలు, రవాణా ఖర్చులు, రూపాయి మారకం విలువ, నాణ్యత, దేశీయ ఉత్పత్తి వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. కానీ దిగుమతుల వల్ల దేశీయ ధరలపై పడే ప్రతికూల ఒత్తిడిని ప్రభుత్వం ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి.

దేశీయ పత్తి ఉత్పత్తి తగ్గుతుంటే రైతులకు భరోసా ఏది?
2026-27 పత్తి సీజన్లో దేశీయ పత్తి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, పరిశ్రమల అవసరాలకు తగినంత పత్తి అందుబాటులో ఉండకపోవచ్చని నోటిఫికేషన్ లో అంశాల ఆధారంగా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.అక్టోబర్ 26న రాయిటర్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం దేశీయ పత్తి ధరలు క్వింటాలుకు రూ.9,000కు పైగా ఉన్నాయి. 2026-27 సీజన్లో దేశీయ పత్తి ఉత్పత్తి 2.9 కోట్ల బేళ్ల కంటే తక్కువగా ఉండవచ్చని, వస్త్ర పరిశ్రమల అవసరం 3.4 కోట్ల బేళ్లకు మించవచ్చని అంచనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలు దిగుమతి సుంకం మినహాయింపును పొడిగించాలని కోరాయి. పరిశ్రమల విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం మినహాయింపు గడువును పొడిగించింది.
అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
దేశీయ పత్తి ఉత్పత్తి తగ్గుతుంటే అందుకు ప్రధాన కారణాలను గుర్తించి ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం లేదా?
పరిశ్రమలకు పత్తి కొరత ఏర్పడితే దిగుమతి సుంకం మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం, పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
పరిశ్రమల అవసరాలపై చూపుతున్న శ్రద్ధలో కనీసం కొంతైనా పత్తి ఉత్పత్తి చేస్తున్న రైతుల సమస్యలపై చూపాలి కదా!
రైతుల ప్రయోజనాలను కాపాడకుండా పరిశ్రమలకు మాత్రమే ఊరట కల్పించడం సమంజసమా?
ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వ్యవసాయ ఉత్పత్తిదారులు, పారిశ్రామిక వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉండాలి.
ఒకవైపు విదేశీ పత్తిని తక్కువ ధరకు దిగుమతి చేసుకునేందుకు సుంకం మినహాయింపు ఇస్తూ, మరోవైపు దేశీయ పత్తి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా హామీ కల్పించకపోతే అది రైతుల పట్ల వివక్షతో కూడిన విధానమే అవుతుంది.

● దేశీయ పత్తి రైతులకు ఉత్పత్తి వ్యయానికి తగిన గిట్టుబాటు ధర కల్పించాలి.
● స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన C2+50 శాతం సూత్రం ప్రకారం కనీస మద్దతు ధర నిర్ణయించాలి.
●మార్కెట్ ధర MSP కంటే తగ్గితే CCI ద్వారా వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలి.
● రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
●దిగుమతుల వల్ల దేశీయ మార్కెట్ ధరలపై పడే ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించాలి.
●విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను నియంత్రించి సబ్సిడీలు పెంచాలి.
●భూమి కౌలు రేట్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
● కౌలురైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందించాలి.
★ ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం, మండలం కనుమూరు గ్రామంలో ఎకరం పత్తి సాగుకు రూ.45 నుంచి 50వేలు అవుతుంది. దీనికి అదనంగా రూ.20వేలు కౌలు చెల్లించాలి. ఎకరానికి దిగుబడి కేవలం 6 క్వింటాలు మాత్రమే వస్తుంది. రాష్ట్రంలో పొడవైన పింజరకం మరియు మద్యస్థ పింజ రకం పత్తిని అత్యధికంగా సాగు చేస్తున్నారు. పొడవైన పింజపత్తి మద్దతు ధర రూ.8667, మధ్యస్థ పింజ పత్తి ధర రూ.8267 ఉంది ప్రస్తుతం క్వింటా రూ.7000 నుంచి 7500 మధ్య కొనుగోలు చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది.
రాష్ట్రంలో పత్తి సాగు చేస్తున్న రైతాంగంలో కౌలురైతుల వాటా గణనీయంగా ఉంది. పత్తి సాగుదారుల్లో సుమారు 90 శాతం మంది కౌలురైతులనే అంచనా. ఈ నేపథ్యంలో వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీరిలో అత్యధికులు చిన్న, సన్నకారు రైతుల స్థాయిలోనే సాగు చేస్తున్నారు.ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో పత్తి సాగు చేస్తున్న రైతులు ఈ నిర్ణయం వల్ల ఎదురయ్యే మార్కెట్ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అధిక వర్షాలు, తెగుళ్లు, పంట దిగుబడుల తగ్గుదల, పెట్టుబడి వ్యయాల పెరుగుదల వంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి.
పత్తి సాగులో పెట్టుబడులు పెట్టే కౌలురైతులకు భూమి కౌలు అదనపు భారంగా మారుతోంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు అందకపోవడంతో ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్నారు. పంట చేతికొచ్చిన వెంటనే అప్పులు తీర్చాల్సిన ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ ధర తగ్గితే తీవ్రంగా నష్టపోయేది కౌలురైతులే.
ప్రభుత్వం అందించే పంట పరిహారం, బీమా, పెట్టుబడి సాయం వంటి పథకాలు కూడా భూ యజమానులకే పరిమితమవుతున్నాయి. వాస్తవంగా సాగు చేస్తున్న కౌలురైతులకు అనేక సందర్భాల్లో ప్రయోజనాలు అందడం లేదు.
అందువల్ల పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు పొడిగింపు నిర్ణయంతోపాటు కౌలురైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి.
సిసిఐ(CCI) కొనుగోళ్లను విస్తరించాలి.. కౌలురైతులకు కూడా కొనుగోలు హక్కు కల్పించాలి
పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించాలి. మార్కెట్ ధర MSP కంటే తగ్గినప్పుడు మాత్రమే కాకుండా, రైతులకు న్యాయమైన ధర లభించేలా కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయాలి. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రతి పత్తి సాగు ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. తేమ శాతం, నాణ్యత వంటి నిబంధనల పేరుతో రైతుల పత్తిని అన్యాయంగా తిరస్కరించకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలి.
అన్నింటికంటే ముఖ్యంగా కౌలురైతులు పండించిన పత్తిని కూడా CCI కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం కల్పించాలి. భూమి యాజమాన్య పత్రాల ఆధారంగా కాకుండా వాస్తవ సాగుదారుడి గుర్తింపును ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన కౌలురైతులకు పరిహారం, పంట బీమా ప్రయోజనాలు అందించాలి. కౌలురైతులకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలు కల్పించాలి.
పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు పొడిగింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం దేశీయ పత్తి రైతులకు స్పష్టమైన భరోసా ఇవ్వాలి. వస్త్ర పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటంతోపాటు పత్తి రైతుల ఆదాయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మౌనం వీడి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాష్ట్రంలోని పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలి.
ప్రధానంగా కింది డిమాండ్లను అమలు చేయాలి.
●పత్తి దిగుమతి సుంకం మినహాయింపు వల్ల దేశీయ రైతులకు కలిగే ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలి.
● దేశీయ పత్తి రైతులకు C2+50 శాతం సూత్రం ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలి.
●MSP కంటే తక్కువ ధరకు పత్తి కొనుగోలు జరగకుండా CCI ద్వారా సమర్థవంతమైన కొనుగోళ్లు చేపట్టాలి.
●పత్తి కొనుగోలు కేంద్రాలను విస్తరించి ప్రతి సాగుదారుడికి విక్రయించే అవకాశం కల్పించాలి.
●కౌలురైతులకు కూడా కొనుగోలు, పంట పరిహారం, బీమా ప్రయోజనాలు అందించాలి.
●విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను నియంత్రించాలి.
●కౌలురైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందించాలి.
●ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పత్తి రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలి.
● దిగుమతులు, దేశీయ కొనుగోళ్లు, మార్కెట్ ధరలు, CCI నిల్వల వివరాలను పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలి.
రైతు ప్రయోజనాలు లేకుండా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమా?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఒక విధానపరమైన వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు తక్కువ ధరకు అందించడానికి విదేశీ పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపును పొడిగిస్తోంది. కానీ అదే సమయంలో దేశీయ పత్తి రైతులకు ఉత్పత్తి వ్యయానికి తగిన ధర లభించేలా ఎలాంటి అదనపు భరోసా కల్పిస్తుందో స్పష్టత లేదు. పత్తిని ఉత్పత్తి చేసే రైతు కష్టాన్ని, పెట్టుబడిని, శ్రమను గుర్తించకుండా కేవలం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే ప్రభుత్వ విధానంగా మారితే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది.
రైతు పండించిన పత్తికి గిట్టుబాటు ధర లభించాలి. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు కూడా అందుబాటులో ఉండాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వ బాధ్యత. ఒకరి ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాలను బలిచేయడం అభివృద్ధి విధానం కాదు.
పరిశ్రమలకు చౌక పత్తి అందించాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వానికి, పత్తిని పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనే బాధ్యత కూడా ఉండాలి.
రైతుల ఆదాయాన్ని తగ్గించి పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం నిజమైన వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి కాదు. దేశీయ పత్తి రైతులను రక్షించకుండా వస్త్ర పరిశ్రమల అభివృద్ధి గురించి మాట్లాడటం అసంపూర్ణమైన ఆర్థిక విధానం. పత్తి రైతు బతికితేనే పత్తి ఆధారిత పరిశ్రమలకు భవిష్యత్తు ఉంటుంది. రైతును రక్షించడం అంటే వ్యవసాయాన్ని, పరిశ్రమలను, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడమే!

పి. జమలయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం

