మద్దతు ధర ఇచ్చే వరకు రైతుల పోరాటం ఆగదు

కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరిక

విజయవాడ: రైతులు పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించే వరకు కేంద్ర ప్రభుత్వంపై రైతుల పోరాటం కొనసాగుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో రైతు సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి.

ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ.. రైతు నాయకులకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, పురుగుమందులు, రసాయన ఎరువులు, రుణాలు అందుబాటులో ఉంచడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విత్తన చట్టం, రుణ విమోచన చట్టం తీసుకురావాలని కోరారు.

ధర్నా శిబిరంలో రైతు, ప్రజా సంఘాల నాయకులు

ఉద్యమాలతోనే కేంద్రంపై ఒత్తిడి

ప్రముఖ మేధావి చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచే చరిత్ర రైతులకే ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు రుణాలు రద్దు చేస్తూ, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వ విధానాలను తెలియజేస్తోందని విమర్శించారు. రైతుల డిమాండ్ల సాధనకు ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై. కేశవరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగాన్ని, రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతు వ్యతిరేక విధానాలపై విమర్శలు

ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడు యలమందరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని విమర్శించారు. రైతు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డి. హరినాథ్ మాట్లాడుతూ.. రైతు ఉద్యమంలో 750 మంది ప్రాణాలు కోల్పోయినా, ఏడాదిపాటు పోరాటం సాగినా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వి. కృష్ణయ్య, సత్యనారాయణ, చుండూరు రంగారావు, డాక్టర్ కొల్లా రాజమోహన్, మర్రెడ్డి వెంకటరెడ్డి, పి. జమలయ్య, మరీదు ప్రసాద్‌బాబు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు కె. పోలారి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాణి, వి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిరసన సభకు వి. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *