విజయవాడలో మెగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ శిబిరం
800 మంది పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ
విజయవాడ, నవంబర్ 28: పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాలను సులభంగా సమర్పించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా విజయవాడలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (CGCA) కార్యాలయ అదనపు సీజీసీఏ డాక్టర్ షికా మాథుర్ కుమార్ ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 800 మంది పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేశారు.
ప్రాంతీయ భాషల్లోనూ డిజిటల్ సేవలు
టెలికాం శాఖకు చెందిన సంపన్ 2.0 (SAMPANN 2.0) పోర్టల్‌ను మరింత సులభంగా వినియోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. త్వరలో చాట్‌బాట్‌ల ద్వారా ప్రాంతీయ భాషల్లో సేవలు అందించడంతో పాటు, ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సదుపాయాన్ని విస్తరిస్తామని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, కుటుంబ పెన్షనర్లకు కూడా డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు.

వైద్య, సైబర్ భద్రతపై అవగాహన
ఈ శిబిరానికి టెలికమ్యూనికేషన్స్, తపాలా, ఆకాశవాణి, దూరదర్శన్, రైల్వే, ఆదాయపు పన్ను, అకౌంటెంట్ జనరల్, కేంద్ర ప్రజాపనుల శాఖ, కస్టమ్స్, జీఎస్టీ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన పెన్షనర్లు హాజరయ్యారు. వచ్చిన వారందరికీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు రూపొందించి అందించారు. పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
నవంబర్ నెలంతా దేశవ్యాప్తంగా ప్రచారం
2026 నవంబర్ 1 నుంచి 30 వరకు దేశంలోని అన్ని జిల్లాలతో పాటు 2,000కు పైగా ఉపవిభాగ కేంద్రాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ గుర్తింపు సాంకేతికత (Face Authentication Technology) ద్వారా పెన్షనర్లు సులభంగా జీవన ప్రమాణ పత్రాలు సమర్పించేలా చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే పెన్షనర్లకు ఈ సేవలను చేరువ చేస్తున్నారు.
పలువురు ఉన్నతాధికారుల హాజరు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సీసీఏ ఎం. ఇందు మాధవి, జాయింట్ సీసీఏ సందీప్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీసీఏ రవీజా, డీఓపీపీడబ్ల్యూ డైరెక్టర్ ప్రమోద్ కుమార్, సీసీఏ ఏపీ హెడ్ ఎస్. తారాచంద్, బీఎస్ఎన్ఎల్ సీజీఎం, ఎల్ఎస్ఏ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు.

